(ఎం.భుజేందర్/మనతెలంగాణ)
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. వినూత్న పద్ధతుల్లో కెటిఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వీలైనంత ఎక్కువగా జనంలోకి వెళుతున్నారు. ఎన్నికల ప్రచారం సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, టివి, పత్రిక ఇంటర్వ్యూలతో కెటిఆర్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎన్నికలకు గులాబీ సైన్యాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయడంతో పాటు పార్టీలో అసంతృప్తులను దారిలోకి తెచ్చుకున్నారు. తమపై ప్రత్యర్థులను చేసే విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతూనే మళ్లీ బిఆర్‌ఎస్‌కే తెలంగాణ ప్రజలు ఎందుకు పట్టం కట్టాలో వివరిస్తూ ప్రజలు చర్చించుకునే ప్రసంగాలు చేస్తున్నారు. పార్టీ కేడర్‌ను పూర్తిస్థాయిలో సమన్వయం చేస్తూనే రాజకీయాలపై మేధావులు, ప్రముఖులు, సామాన్య ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
లోక్‌సత్తా వ్యవస్థాపకులు, మాజీ ఐఎఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణతో సమకాలీన రాజకీయాలపై ఓ టీవీ ఛానల్‌లో విస్తృతంగా చర్చించిన కెటిఆర్, గంగవ్వతో తనదైన స్టైల్‌లో వంట చేస్తూనే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అందరికీ అర్థమయ్యేలా తెలంగాణ యాసలో వివరించారు. రేడియో మిర్చి స్టూడియో యువతతో రాజకీయాలు మాట్లాడి, అక్కడి యువతతో సరదాగా ముచ్చటించి సందడి చేశారు. అలాగే న్యాయవాదులు, పారిశ్రామిక వేత్తలు, దళిత పారిశ్రామిక వేత్తలు(డిక్కీ), చిన్న తరహా పారిశ్రామికవేత్తలు, మహిళలు, ఉద్యోగార్థులతో వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూనే పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రోజూ రోడ్ షోలు నిర్వహిస్తూ పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. సోషల్ మీడియాలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కెటిఆర్ తమకు ఏదైనా సమస్య ఉందని సాధారణ ప్రజలు ఒక్క ట్వీట్ చేసినా వెంటనే స్పందించి పరిష్కరిస్తారు. రాష్ట్రాభివృద్ధికి భవిష్యత్తు ప్రణాళిక, రాజకీయాల్లో నూతనోత్తేజంపై తన గొంతుకను క్షేత్రస్థాయికి వినిపిస్తున్నారు. మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవడమే ధ్యేయంగా అకుంఠిత దీక్షతో, పట్టుదలతో కెటిఆర్ అన్నీ తానై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
హోటళ్లలో సాధారణ వ్యక్తిలా అందరితో ముచ్చట్లు
ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్న కెటిఆర్ ఆకస్మికంగా సాధారణ వ్యక్తిలా హోటళ్లకు వెళ్లి అందరితో ముచ్చిటించారు. ఇటీవల ప్రముఖ నీలోఫర్ కేఫ్‌లో సందడి చేసిన కెటిఆర్ గతవారం షాదాబ్ హోటల్‌కి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. గత శుక్రవారం ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో రోడ్ షోలు ముగిసిన అనంతరం మంత్రి కెటిఆర్.. నేరుగా చార్మినార్ సమీపంలోని ఫేమస్ షాదాబ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. మంత్రిని చూసిన అక్కడున్న వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా బిర్యానీ ఆర్డర్ చేసిన మంత్రి కెటిఆర్.. సామాన్య ప్రజలతో కలిసి కూర్చొని తిన్నారు. అనంతరం అక్కడి నుంచి మొజంజాహీ మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ ఫేమస్ ఐస్ క్రీమ్ షాపులో ఐస్‌క్రీమ్ రుచి చూశారు. రాత్రి 11 గంటల సమయంలో మంత్రి కెటిఆర్ తమతో పాటు సాధారణ వ్యక్తిలా హోటల్లో ప్రత్యక్షం అవడంతో వారంతా ఆశ్చర్యం, సంతోషం వ్యక్తం చేశారు. వారంతా మంత్రి కెటిఆర్‌తో ముచ్చటించారు. ముఖ్యంగా హైదరాబాద్ దగ్గర ప్రగతి, ప్రస్తుత ఎన్నికల సందర్భంగా ఉన్న పరిస్థితులపైన తమ అభిప్రాయాలను మంత్రితో పంచుకున్నారు. కెటిఆర్ రాకతో ఆ రెండు ప్రాంతాలు సందడిగా మారిపోయాయి. మంత్రిని చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఈ ఆకస్మిక పర్యటనలో ప్రభుత్వ పనితీరు గురించి ప్రజలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఆలోపించజేస్తున్న కెటిఆర్ ప్రసంగాలు
బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల మద్దతుగా కెటిఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలలో సూటిగా సుత్తి లేకుండా ప్రసంగిస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్లుగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, మరోసారి తమకు అవకాశం ఇస్తే చేయబోయే పనులను వివరిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో వచ్చిన విప్లవాత్మక పురోగతితో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలు ఏర్పాటు వివరిస్తూ, గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం బెంగళూరుకు ధీటుగా ఎదిగి భారీ స్థాయిలో ఉద్యోగాలు లభిస్తున్న వాస్తవాలను గణాంకాలతో సహా కెటిఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించినప్పుడు యువత నుంచి మంచి స్పందన లభిస్తోంది. అలాగే ప్రభుత్వ రంగంలో గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించి, 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పూర్తి చేసిన వాస్తవాలను గణాంకాలతో సహా నిరుద్యోగ యువత ముందు ఉంచడంతో పాటు మరోసారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, పరీక్షల నిర్వహణలో అవసరమైన మార్పులు తీసుకువచ్చి, వేగవంతంగా ఉద్యోగాల భర్తీ చేపడతామని ఉద్యోగార్థుల్లో కెటిఆర్ భరోసా నింపుతుండటంతో నిరుద్యోగ యువత, వారి తల్లిదండ్రుల నుంచి కెటిఆర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.