కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. తెలంగాణలో ఆరు గ్యారంటీలు పక్కాగా అమలవుతాయని… గ్యారంటీలను అమలు చేస్తామని మా అమ్మకు చెప్పి ఇక్కడికి వచ్చానని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మధిరలో ఏర్పాటు చేసి కాంగ్రెస్ బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరై ప్రసంగించారు.
తన కోసం ఎండలో తరలివచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. తెలంగాణ కోసం చాలా మంది పోరాటం చేశారని… ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో అమరులయ్యారని అన్నారు. తెలంగాణలో తాను నిజాలే మాట్లాడుతున్నానని చెప్పారు. భట్టీ విక్రమార్క పాదయాత్రను తాను చూశానని, ఆయన కోసం ఇక్కడికి వచ్చానన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని.. బలమైన సర్కార్ తోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు కోట్ల ప్రజలను మోసం చేసిందని, రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నాశనం చేసిందని విమర్శించారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. కాంగ్రెస్ పాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.