న్యూఢిల్లీ : చైనాలో ఇప్పుడు తలెత్తిన శ్వాసకోశ వ్యాధుల హెచ్9ఎన్2 కేసుల ఉధృతి ఇతర దేశాల్లోనూ కలవరానికి దారితీసింది. ఈ వైరస్ వల్ల భయమేమీ లేదని నిర్లక్షం వహించరాదని స్థానిక రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ అజయ్ శుక్లా ప్రజలకు సూచించారు. జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంతకు ముందటిలాగానే శుభ్రతను పాటించాలి. ఇతరులు ఎవ్వరైనా తమ సమీపంలో శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లు అయితే వారికి దూరంగా ఉండటం మంచిదని కోరారు. చైనాలో ఇప్పుడు తలెత్తిన వైరస్ ప్రత్యేకించి ఉత్తర ప్రాంతంలో భారీ సంఖ్యలో ప్రజలకు శ్వాసకోశ సమస్యలకు దారితీసింది. ఇది తీవ్రస్థాయి న్యూమోనియా కావడంతో ప్రత్యేకించి బాలలకు సంకట స్థితి ఏర్పడుతోంది.
వైరస్‌ల నుంచి తలెత్తే ఎటువంటి జబ్బు అయినా ఇతరులకు సోకుతుంది, సాధ్యమైనంత వరకూ వీటికి గురి కాకుండా చూసుకోవడమే ప్రధాన విషయం అవుతుంది. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే మనకు మనం పరిశుభ్రంగా ఉండటం ప్రధానం. పలు ప్రాంతాలలో వాయు కాలుష్య తీవ్రత కూడా ఉంది. కరోనాదశలో వాడినట్లే ఇప్పుడు కూడా సాధ్యమైనంత వరకూ ఎక్కువగా ఎన్95, ఎన్ 99 మాస్క్‌లు వాడాలి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుని తీరాలి. పలు ఆరోగ్య పద్ధతులు పాటించాల్సి ఉంది.
స్కూళ్లకు వెళ్లే పిల్లలై ప్రత్యేక దృష్టి
ప్రస్తుత వైరస్ శ్వాసకోశ సమస్యలకు దారితీస్తున్నందున ఎక్కువగా పిల్లలకు ఇది చిక్కులు తెచ్చిపెడుతుంది. స్కూళ్లకు వెళ్లే పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని డాక్టర్ శుక్లా తెలిపారు. ప్రత్యేకించి వారిలో దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు తలెత్తకుండా చూసుకోవాలి. బడులలో పిల్లలు ఎవరైనా జలుబు తుమ్మలతో బాధపడుతూ ఉన్నట్లు అయితే గుర్తించి వీరి విషయాన్ని స్కూళ్లకు తెలియచేయాల్సి ఉంటుంది. జ్వర లక్షణాలు ఉండే పిల్లలను స్కూళ్లకు పంపించకుండా ఉండటం మంచిది. స్కూళ్లలో ఎక్కువ మంది పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు తలెత్తడం చివరికి ఇప్పుడు ఇది దేశంలో ప్రమాదకర పరిస్థితికి దారితీసిందని డాక్టర్ శుక్లా తెలిపారు. చైనాలో ఇప్పుడు తలెత్తిన ఇంఫ్లూయెంజా సమస్యకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికాకపోవడం వల్ల ఇతరదేశాల్లో తీసుకోవల్సిన జాగ్రత్త చర్యలపై స్పష్టత రావడం లేదు.
చైనాలో సుదీర్ఘ కోవిడ్ తరువాతి లాక్‌డౌన్ల క్రమంలో జనంలో ఇమ్యూనిటి శాతం పడిపోతూ వచ్చింది. దీనితో ఇప్పుడు ఎటువంటి వైరస్ అయినా అక్కడి ప్రజలలో ఎక్కువగా వ్యాపిస్తుంది. తరువాతి క్రమంలో ఇది అంతర్జాతీయ స్థాయిలో అనారోగ్మ సమస్యల తీవ్రతకు దారితీస్తోంది. ఈ అంశాన్ని ప్రత్యేకంగా డాక్టర్ శుక్లా ప్రస్తావించారు. ఇప్పటి వైరస్ సంబంధిత శ్వాసకోశ సమస్యల తీవ్రతపై తమకు ఎప్పటికప్పుడు తగు సమాచారం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెంటనే చైనాను కోరింది. 2020 జనవరి 5వ తేదీన చైనాలో కోవిడ్ 19 ముందస్తు దశలో తలెత్తిన భయాందోళనల దశలో చైనాకు వెలువరించిన సందేశం తరహాలోనే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి చైనా నుంచి వివరణ కోరారు.