కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణకు వెళ్లావు ఏం మెసేజ్ ఇస్తావని సోనియా అడిగింది, ప్రజలకు సత్యం మాత్రమేనని చెబుతానని ఆమెతో చెప్పానని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేస్తే, తెలంగాణలో భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేశారని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఇద్దరు పాదయాత్ర చేయడం సంతోషంగా ఉందన్నారు. శనివారం మధిరతో పాటు పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రియాంకగాంధీ మాట్లాడుతూ భట్టి నియోజవర్గంలో ప్రచారం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు ఎంతో పోరాటం చేశారన్నారు. బలమైన ప్రభుత్వం ఏర్పడి ఉంటే తెలంగాణ ప్రజలు కలలు నేరవేరేవని ప్రియాంక అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు తప్పని సరిగ్గా అమలు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నేరవేర్చే ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తామని మరోసారి ప్రియాంక హామీ ఇచ్చారు.
డాన్స్ చేసిన ప్రియాంక
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఖమ్మంలో రోడ్ షో పాల్గొన్నారు. ఈ ర్యాలీ భారీ జన సందోహం మధ్య సాగింది. అయితే రోడ్ షోకి వచ్చిన కార్యకర్తలకు మరింత ఉత్సాహం నింపేందుకు ప్రియాంక గాంధీ ప్రచార రథంపై డ్యాన్స్ చేసి అలరించారు. అందులోనూ రేవంత్ రెడ్డి పాటకు బంజారా మహిళలతో కలిసి ప్రచారం రథంపై స్టెప్స్ వేశారు. దీంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున విజిల్స్ వేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.