Saturday, December 28, 2024

పోరుకు సై అంటున్న అతివలు

- Advertisement -
- Advertisement -

(లక్కా భాస్కర్‌రెడ్డి/మన తెలంగాణ)
ఆకాశంలో సగం… అర్ధనారీశ్వరం… అవకాశం వస్తేనో… ఇస్తేనో కాదు… తెలంగాణ శాసనసభకు ప్రాతినిధ్యం పొందేందుకు వాటిని అందిపుచ్చుకున్న మగువలు ఎన్నికల రణక్షేత్రంలో దూసుకు పోతున్నా రు. రాజకీయ రణతంత్రపు ఎత్తులు పైఎత్తుల వ్య్యూహరచన ల్లో తమదైన ముద్రను చూపుతున్నారు. తమకు పోటీగా నిలిచిన మగవారికి సైతం ముచ్చెమటులు పట్టిస్తున్నారు. ఎన్నికల పోరాటంలో మగువలు చూపుతున్న తెగువ తెలంగాణ ప్రజానీకం చేత ముక్కున వేలేయిస్తొంది. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఈ సారి శాసనసభకు ఎన్నికయ్యేందు కు 31 నియోజకవర్గాల్లో మహిళలు మగవారితో పోటీ పడుతున్నారు. ఇందులో 29 నియోజకవర్గాల్లో ఎదో ఒక ప్రధా న పార్టీ నుంచి మహిళ మరో రెండు ప్రధాన పార్టీల అభ్యర్ధులకు గట్టి పోటీ నిస్తుండగా, మరో రెండు నియోజకవర్గాల్లో రెండు ప్రధాన పార్టీల నుంచి మహిళలు ఇద్దరే ఒకరిపై మరొకరు ఎన్నికల పోరను హోరెత్తిస్తున్నారు.

ఎన్నికల్లో టిక్కెట్టు సాధిచంటం ఒక ఎత్తయితే, ఆ తర్వాత నామినేషన్ మొదలు ఎన్నికల ప్రచారం వరకూ పోటీలో ఉన్న మహిళా అభ్యర్ధులు చూపుతున్న వ్యూహాత్మక ఎత్తుగడలు వారిపై పోటీలో ఉన్న మగ అభ్యర్ధులకు కూడా అంతు చిక్కటం లేదు. ఇందులో అత్యధికశాతం ఎన్నికల రణక్షేత్రానికి కొత్తవారే అయినా వారు అనుసరిస్తున్న ఎన్నికల వ్యూహాలు, ప్రచారంలో ఓటర్లను ఆకర్షిస్తున్న తీరు, అనుచర వర్గాలను సమన్వయం చేసుకుంట్నున తీరు, మహిళగా సహజసిద్దమైన ప్రతికూలతలను కూడా అధిగమిస్తూ, ప్రత్యర్ధుల బలహీనతలతను తమకు అనుకూలంగా మలుచుకుంటూ, సమయ పాలన చేసుకుంటూ, పార్టీ శ్రేణులను విజయపధం వైపు నడిపిస్తున్న తీరు తమతో కడి ఎడమల పోటీగా ఉన్న ఇతర పార్టీల ప్రత్యర్ధుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి.

విజయం కోసం ఇక్కడ మల్లయుద్దం!
ఎన్నికలు జరుగుతున్న పలు నియోజకవర్గాల్లో విజయం దక్కింకునేందుకు మహిళా అభ్యర్దులు చేస్తున్న పోరాటాలు మల్లయుద్దాలను తలపిస్తున్నాయి. ఇందులో పలుమార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉన్న మహిళా అభ్యర్ధులు ఎన్నికల ప్రచార రధాలను నడిపిస్తున్న తీరు ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇందులో ఐదారు నియోజకవర్గాల్లో ఎన్నికల పోరాటం రాష్ట్ర ప్రజలను దృష్టిని మరల్చనీయకుండా చేస్తోంది. మహేశ్వరం నియోజకవర్గం ఇందులో ముందు వరుసలో కనిపిస్తోంది. ఇక్కడ అధికార బిఆర్‌ఎస్ అభ్యర్ధిగా మంత్రి సబితాఇంద్రారెడ్డి తన రాజకీయ అనుభవాన్నంతా కూడదీసుకుని విజయమో వీరస్వర్గమో అన్నంతగా పోరాడుతున్నారు. సబత దూకుడును నిలువరించేందుకు కాంగ్రెస్ అభ్యర్ధి కిచ్చెన్నగారి లకా్ష్మరెడ్డి, బిజేపి అభ్యర్ది శ్రీరాములు యాదవ్ తమ శక్తినంతా ఉగ్గదీసుకుని పోరాడుతున్నారు. అలేరు నియోజకవర్గంలోనూ ఇటు వంటి పరిస్థితే కనిపిస్తోంది. ప్రభుత్వ విప్‌గా ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధి గొంగడి సునీత ఎన్నికల్లో అన్నీ తానై దూసుకుపోతున్నారు.

ఒక వైపు ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు ,మరోవైపు ఓటర్ల మనస్తత్వాన్ని పసిగట్టి వారిని కారు గుర్తుకు ఓటు గుద్దేలా కట్టిపడేసే ప్రణాళికల అమలు తీరు ప్రత్యర్ధి పార్టీలకు అంతు చుక్కటం లేదు. కాంగ్రెస్ అభ్యర్ధి బీర్ల మల్లయ్య, బిజెపి అభ్యర్ధి పడాల శ్రీకాంత్‌తోపాటు బిరిలో ఉన్న మరికొందరు సునీత వేగాన్ని అందిపుచ్చుకునేందుకు చెమటోడుస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో పద్మాదేవేందర్ రెడ్డి అధికార బిఆర్‌ఎస్ పార్టీ నుంచి మరో మారు విజయాన్ని అందిపుచ్చుకోవటమే లక్షంగా పోరాడుతున్నారు. పద్మ అర్ధబలం అంగబలం ముందు నిలదొక్కుకునేందుకు కాంగ్రెస్ అభ్యర్ధి మైనంపల్లి రోహిత్ , బిజేపి అభ్యర్ధి పంజా విజయ్‌కుమార్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇల్లెందు నియోజకవర్గంలోనూ ఇదే రీతిలో పోరు సాగుతోంది. బిఆర్‌ఎస్ అభ్యర్ధి హరిప్రయా నాయక్ విజయానికి అడ్డుకట్టు వేసేందుకు కాంగ్రెస్ అభ్యర్ధి కోరం కనకయ్య, బిజేపి అభ్యర్ధి రవీంధ్రనాయక్ శ్రమిస్తున్నారు.

మహిళకు మహిళే దీటైన పోటీ…
ములుగు నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థిలు రాష్ట్ర ప్రజలను మరింతగా ఆకర్షిస్తూ ఆసక్తి గొలుతున్నాయి. ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి మహిళకు మహిళే గట్టి పోటీ ఇస్తోంది. కాంగ్రెస్ అభ్యర్ధి అనసూయ అలియాస్ సీతక్క మరో మారు విజయం కోసం తనదైనశైలిలో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. సీతక్క జనంలోకి కలిసిపోతున్నతీరు ముందు ఆమె విజయం మరో మారు ఖాయం అన్న ధీమాను సడలగొట్టేందుకు బిఆర్‌ఎస్ అభ్యర్ధి నాగజ్యోతి శక్తికి మించిన రీతిలో సాహసాలు చేస్తున్నారు. బిజెపి అభ్యర్ధిగా అజ్మీరా ప్రహ్లాద్ కూడా ఇక్కడి పోటీలో ఉన్నారు. ఇదే రీతోలో రాజకీయ వాతావరణం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోనూ కనిపిస్తోంది. ఇక్కడ బిఆర్‌ఎస్ ఆభ్యర్ధి లాస్య నందితకు కాంగ్రెస్ అభ్యర్ధి జి. వెన్నలకు హోరాహోరి పోరు సాగుతోంది. బిజేపి అభ్యర్ధిగా ఇక్కడ గణేష్ నారాయణ పోటీలో ఉన్నారు.

ఇక్కడ గెలుపు అంత సులువు కాదు…
ప్రధాన రాజకీయ పార్టీల నుంచి మహిళలు పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గాల్లో వీరిని ఓడించి విజయాన్ని అందిపుచ్చుకోవటం అంత సులువేమి కాదని పోటీలో ఉన్న పురుష అభ్యర్ధులకు తెలిసొస్తోంది. ఇక్కడ ప్రధాన పార్టీలు కూడా బలమైన మహిళా అభ్యర్ధులనే పోటీకి నిలిపాయి. ఎన్నికల ప్రచారం చివరిఘట్టానికి చేరువవుతున్న వేళ ఈ నియోజకవర్గాల్లో మహిళా అభ్యర్ధులను ఎదుర్కొవంటంలో ఇతర పార్టీల అభ్యర్ధులకు చుక్కలు కనిపిస్తున్నాయి. నర్సాపూర్‌లో బిఆర్‌స్ అభ్యర్ధి సునితా లకా్ష్మరెడ్డితో పోటీ కాంగ్రెస్ అభ్యర్ధి ఆవుల రాజిరెడ్డి, బిజేపి అభ్యర్ది మురళీయాదవ్‌కు పెద్ద సవాల్‌గానే మారింది. ఆసిఫాబాద్‌లో బిఆర్‌ఎస్ అభ్య ర్ధి కోవా లక్ష్మికి కాంగ్రెస్ అభ్యర్ధి అజ్మీరా నాయక్, బిజేపి అభ్యర్ధి ఆత్మారాం నాయక్ మధ్య కూడా గట్టి పోటీ నెలకుం ది. కాంగ్రెస్ పార్టీనుంచి కూడా పలువురు సీనియర్ మహి ళా నేతలు మరోమారు అసెంబ్లీలో అడుగు పెట్టెందుకు అహర్నిషలు శ్రమిస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ కోదాడలో ఎన్ పద్మావతిరెడ్డి ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధులకు గట్టిసవాళ్లు విసురుతున్నారు.

ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి విజయారెడ్డి బిఆర్‌ఎస్ అభ్యర్ధి దానం నాగేందర్ బిజేపి అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డిల మధ్య ప్రచారపోరు హోరెత్తుతోంది. సనత్ నగర్‌లో కోట నీలిమ, గోషామహల్‌లో మొగలి సునీత, నారాయణపేట్‌లో పర్ణిక చిట్టెం, గద్వాలలో సరిత, స్టేషన్‌ఘన్‌పూర్‌లో సింగపురం ఇందిర, పాలకుర్తిలో మామిడాల యశశ్వని, గట్టి పోటీ ఇస్తున్నారు. మహిళా అభ్యర్ధులు గట్టిపోటీ ఇస్తున్న మిగిలిన నియోజకవర్గాల్లో బిజేపి నుంచి జుక్కల్‌లో అరుణతార,బాల్కొండలో ఏలేటి అన్నపూర్ణ, జగిత్యాలలో బోగ శ్రావణి, రామగుండంలో సంధ్యారాణి, చొప్పదండిలో బొడిగ శోభ, సిరిసిల్లలో రాణి రుద్రమ, చార్మినార్‌లో మేఘారాణి, అలంపూర్‌లో మేరమ్మ, నాగార్జున సాగర్‌లో కంకణాల నివేదిత, హుజూర్ నగర్‌లో చల్లా శ్రీలతా రెడ్డి, డోర్నకల్‌లో భూక్యా సంగీత, వరంగల్ పశ్చిమలో రావు పద్మ, వనపర్తిలో అనుజ్ణరెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అశ్వారావు పేట నుంచి జనసేన పార్టీ అభ్యర్ధిగా ఉమాదేవి ప్రత్యర్ధులతో తలపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News