Monday, December 23, 2024

రైతు బంధుకు ఈసి బ్రేక్

- Advertisement -
- Advertisement -

నిధుల విడుదలకు అనుమతి రద్దు చేసిన ఈసి
రెండు రోజుల కితం పంపిణీ చేయాలని గ్రీన్ సిగ్నల్
ఎన్నికల ప్రచారంలో రైతుబంధువు ప్రస్తావించ వద్దని షరత్తు
నిబంధనలు ఉల్లంఘించిన ఆర్ధిక శాఖ మంత్రి హారీశ్ రావు

మన తెలంగాణ/హైదరాబాద్:  ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రైతుబంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. ఈమేరకు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఎన్నికల కమిషన్ నిధుల విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతులకు ఊరట లభించినట్టు అయ్యిందికానీ, రైతు బంధు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు నిధులు విడుదల చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు కిందకు వస్తుందని స్పష్టం చేసింది. రెండు రోజుల క్రితం రైతు బంధు నిధుల విడుదలకు ఈసి అనుమతి ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం 28వ తేదీ 70 లక్షల రైతుల ఖాతాల్లో సుమారు రూ.7 వేల కోట్ల రూపాయలు రైతుబంధు నిధులు వేసేందుకు సిద్ధమై ఏర్పాటు చేసింది.

ఇప్పుడు వెలువడిన ఈసి తాజా ఆదేశాలతో రైతుల ఖాతాల్లో నగదు జమ నిలిచిపోయింది. ఆదివారం ఎన్నికల బహిరంగ సభలో రాష్ట్ర ఆర్థిశాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ మీరు సోమవారం ఉదయం టీ తాగే సమయానికి టింగ్ టింగ్ టింగ్ అంటూ రైతుల ఫోన్లకు రైతు బంధు నిధులు జమ అయిన మెసేజ్‌లు వస్తాయని ప్రకటించారు. ఈ రోజు బ్యాంకులకు సెలవు ఉందని సోమవారం గురుపౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉందని సోమవారమే డబ్బులు పడతాయని ప్రకటించారు. మరోవైపు తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఈ నెల 30వ తేదీన జరుగుతుండటంతో ఇప్పుడు రైతు బంధుకు అనుమతి ఇవ్వడం ఏంటి అనే ఫిర్యాదులు కూడా ఎన్నికల కమిషన్‌కు రావడంతో రైతు బంధు అనుమతిని ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తోంది.

రైతుబంధుపై ఇచ్చిన ఆదేశాలు ఉపసంహరించుకోవాలి: ఈసికి బిఆర్‌ఎస్ విజ్ఞప్తి
కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నాలుగు కోట్ల మందికి ‘సంబంధించిన రైతుబంధు చెల్లింపులు నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఎలా ఇస్తుందని భారత రాష్ట్ర సమితి ప్రశ్నించింది. రైతుబంధుపై ఇచ్చిన ఆదేశాలను ఉప సంహరించుకోవాలని ఈసిని కోరిన బిఆర్‌ఎస్ రైతుల ప్రయోజనాల కోసం రైతుబంధు చెల్లింపులను అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బిఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత కేశవరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ను కలిసి వినతి పత్రం అందించారు. రైతుబంధు అంశం ఏ పార్టీకి సంబంధించిన అంశం కాదని, రైతులకు సంబంధించిన అంశమని పార్టీ తెలిపింది. రోగికి ఆపరేషన్ చేసే సమయంలో అవసరమైన ఇంజక్షన్ ఇప్పుడు వద్దని 15 రోజుల తర్వాత తీసుకోవాలని చెప్పినట్లుందని వ్యాఖ్యానించింది. ఇచ్చిన ఉత్తర్వులను ఈసి గతంలో ఎప్పుడూ వెనక్కి తీసుకోలేదని, ఈ విషయంలో సీఈవో కూడా ఆశ్చర్యపోయారని కేశవరావు తెలిపారు. తాము ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదన్న ఆయన నోటీసు ఇచ్చి ఉంటే సమాధానం చెప్పేవాళ్లమని అన్నారు. ఈసి అక్రమంగా ఆదేశాలు ఇవ్వడంతో లక్షల మంది రైతులకు, దేశానికి నష్టం జరుగుతుందని కేకే పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆంక్షలు పెట్టాలని చెప్పిందని, డిల్లీలో ఈసిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. బిఆర్‌ఎస్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు అన్యాయం చేయవద్దని కోరారు. రైతుబంధు చెల్లింపుల కోసం ఈసి రేపటి వరకు ప్రయత్నం చేస్తామని, అనుమతి రాకపోతే ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని కె.కేశవరావు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News