వాటికన్ సిటీ : పోప్ ఫ్రాన్సిస్ తన ఊపిరితిత్తుల వాపు సమస్యకు నరాల ద్వారా యాంటీబయోటిక్స్ పొందగలిగారు. ఆయనకు నిమోనియా లేదా జ్వరం కానీ రాలేదని సోమవారం వాటికన్ వెల్లడించింది. పోప్ ఫ్రాన్సిస్ ఊపిరితిత్తుల వాపు సమస్యతో బాధపడుతున్నానని తనకు తానే ఆదివారం వెల్లడించారు. ఈ కారణం గానే సెయింట్ పీటర్ స్కేర్‌లో వారం వారీ దర్శనం ప్రజలకు ఇవ్వలేక పోతున్నానని దీనికి బదులుగా వాటికన్ ఆవరణ లోని ప్రార్థనా మందిరం నుంచి దీవెనలు అందిస్తానని వివరించారు.
ఊపిరితిత్తుల వాపు వల్ల పోప్‌కు శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బంది అయిందని, శనివారం మధ్యాహ్నం రోమ్ ఆస్పత్రిలో చికిత్స పొందాక ఇప్పుడు ఆయన పరిస్థితి మెరుగుపడిందని వాటికన్ ప్రెస్ ఆఫీస్ డైరెక్టర్ మేట్టియో బ్రూనీ తెలియజేశారు. కొన్నిముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయడమైందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన జరుగుతున్న కాప్ 28 సదస్సులో వాతావరణ మార్పుపై ప్రసంగించడానికి డిసెంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు పర్యటించనున్నట్టు పోప్ ఆదివారం టెలివిజన్ ప్రసారంలో వెల్లడించారు.