Monday, November 18, 2024

ఉత్తర్‌కాశీలో జటిల టన్నెల్ సవాలు

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : కాలంతో క్షణాలతో పోటీపడుతూ ప్రాణాలు రక్షించే ఘట్టం పలు సంక్లిష్టతల మధ్య సాగుతోంది. ఉత్తర్‌కాశీలో సిల్క్‌యారా టన్నెల్ కుప్పకూలి , నిర్మాణ పనులలో ఉన్న 41 మంది వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలు లోపల బందీల పరిస్థితిని ఈ నెల 12వ తేదీ నుంచి ఎదుర్కొంటున్నారు. కాగా ఇప్పుడు సొరంగానికి నిట్టనిలువు రంధ్రం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అయింది. అత్యంత దుర్భర పర్వతాలను తొలిచే ఈ పనికి అతి చిన్న ఎలుక కన్నం వంటి రంధ్రాలు చేయాల్సి ఉంటుంది. దీనితో ఈ పనులలో నిపుణులైన గనుల తవ్వకందార్లను రప్పించారు. అమెరికాకు చెందిన ఆగర్ మిషిన్ సొరంగ శిథిలాల తొలిగింపులో విఫలం అయింది. పైగా అక్కడి భారీ రాళ్లు రప్పల శిథిలాలు తగిలి, ఈ ఇంజిన్ చక్రాలు విరిగాయి. శిథిలాల మధ్యలోనే మిషన్ చిక్కుపడింది. దీనితో భారతీయ సైన్యాన్ని సహాయక చర్యలకు ఇప్పుడు తీసుకువచ్చారు. కొండ పై నిట్టనిలువునా మరో సొరంగం తవ్వి , కూలీల వద్దకు వెళ్లడం ఈ ప్రక్రియ.

ఇది కాకుండా కనీసం ఆరు వివిధ పద్ధతుల ద్వారా కూలీల వెలికితీతకు ప్రణాళికలు రూపొందించారు. గంటల వ్యవధిలోనే కూలీలను వెలికితీసేందుకు వీలుంటుందని సైన్యం ప్రకటించడం వల్ల తిరిగి కూలీల అస్తిత్వంపై ఆశలు రేకెత్తాయి. దాదాపు పక్షం రోజులుగా కూలీలు బందీలయిన స్థితిలో జీవన్మరణ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరికి కన్నాల ద్వారా పైపుల ద్వారా తగు విధంగా ఆహారం, మందులు తగినంతగా ఆక్సిజన్ అందిస్తూ వస్తున్నారు. అయితే వీరిని బయటకు తీసుకురావడడం కాలంతో కీలక పరీక్ష అయింది. లోపలివారి మానసిక స్థయిర్యం దెబ్బతింటే అది అత్యంత తీవ్ర సమస్యకు దారితీస్తుంది. ఓ వైపు వారిని వెలికితీసేందుకు పలు వ్యూహాలు అమలు చేస్తూనే లోపలివారికి స్వాంతన కల్పించడం ప్రధాన విషయం అయింది. ఇప్పుడు రెండు ప్రధాన మార్గాలను ఎంచుకుని సహాయక చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో ఒకటి నిట్టనిలువు మరోటి సమాంతర తవ్వకం. అయితే వీటిని అమలు చేయడం క్లిష్టతరం అవుతుంది.

భారీ రాళ్లను అమాంతంగా పేల్చివేయడానికి వీల్లేదు. డ్రిల్లింగ్ లోపలి వారికి మరింత ఇబ్బంది కల్గించకుండా చేయాల్సి ఉంటుంది. అందుకే చిన్న చిన్న కన్నాలు ఏర్పాటు చేసి తరువాత రంధ్రం వెడల్పునకు దిగవచ్చునని నిర్ణయించారు. సోమవారం టన్నెల్ పై భాగం నుంచి 31మీటర్ల మేర నిట్టనిలువు తవ్వకాలు ముగిశాయి. ఇందుకు ర్యాట్ హోల్ మైనర్స్‌తో కూడిన బృందం చేరుకుంది. పనిలోకి దిగింది. సైనిక బృందాలు కూడా డ్రిల్లింగ్‌కు దిగాయి. వీరు నైపుణ్య కూలీల సాయం తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆగర్ మిషన్‌ను బయటకు పంపించారు. ప్లాస్మా కట్టింగ్ మిషన్ లేదా సాధారణ తవ్వకాలు అంటే మాన్యువల్ మైనింగ్ జరుగుతుందని లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ తెలిపారు.

ఇప్పుడు వర్షాలు, గాలి ఈదుర్ల జోరు భయాలు
ఇప్పటివరకూ పలు రకాలుగా యాంత్రికలోపాలు, సరైన శిక్షణ లేని బృందాలతో కుంటుపడుతూ వచ్చిన అత్యంత కీలకమైన టన్నెల్ ఆపరేషన్‌కు ఇప్పుడు వాతావరణ ప్రతికూలత కూడా మరింత చిక్కులకు దారితీసే పరిస్థితి ఏర్పడింది. భారత వాతావరణ సంస్థ (ఐఎండి) సోమవారం వెలువరించిన నివేదిక ప్రకారం ఉత్తర్‌కాశీ ప్రాంతంలో వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుపాట్లు వంటి సమస్యలు తలెత్తనున్నాయి. ఈ ప్రాంతానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాలు కురిసినా , ఇతరత్రా వైపరీత్యాలు ఏర్పడ్డా ఈ ప్రాంతంలో ఆకస్మిక వరదలు తలెత్తితే అప్పుడు టన్నెల్‌లోని కూలీల పరిస్థితి మరింతగా శేషప్రశ్న అవుతుందని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఘటనాస్థలికి ఉన్నత స్థాయి బృందం…కూలీలతో పలకరింపు
సోమవారం ఈ టన్నెల్ ప్రాంతానికి అత్యున్నత స్థాయి బృందం వచ్చింది. ప్రధాన మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పికె మిశ్రా, హోం శాఖ కార్యదర్శి అజయ్ కె భల్లా, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఎస్‌ఎస్ సంధూ ఇతరులు ఇక్కడికి వచ్చారు. క్షేత్రస్థాయిలో ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యలను సమీక్షించారు. పిఎం సెక్రెటరీ మిశ్రా సొరంగంలోపల చిక్కుపడి ఉన్న కూలీలతో మాట్లాడారు. వారికి ధైర్యం పలికారు. ప్రత్యేక మైక్రోఫోన్ల ఏర్పాట్ల ద్వారా వారిని పలకరించి వారికి ధైర్యం చెప్పారు. ఈ ప్రాంతంలో ఉన్న కూలీల కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు.

మొత్తం 86 మీటర్ల నిలువు రంధ్రం అవసరం
ఇప్పుడు అనుసరిస్తున్న తవ్వక పద్ధతి ప్రకారం కూలీల భద్రతాయుత వెలికితీతకు మొత్తం 86 మీటర్ల మేర నిట్టనిలువు తవ్వకాల మరో సొరంగ మార్గం అవసరం. ఇందులో ఇప్పటికీ 36 మీటర్లు పూర్తయింది. కూలీలను ఈ మార్గంలోకి రప్పించి బయటకు తీసుకురావడానికి వీలేర్పడుతుంది. ఇందుకు అత్యంత కీలకమైన రీతిలో 1.2 మీటర్ల వ్యాసార్థపు పైపులను లోపలికి వదిలిపెట్టాలి, దీనికి సంబంధించి పని ఆదివారం ఆరంభం అయింది పది మీటర్ల మేరక తవ్వకానికి 24 నుంచి 36 గంటల సమయం పడుతుంది. అయితే ఇందుకు అన్ని పరిస్థితులు అనుకూలించాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు. అహ్మదాబాద్, ఢిల్లీల్లో ఇటువంటి తవ్వకాలలో దిట్టలైన ర్యాట్ మైనర్లను ఎంచుకుని ఇక్కడికి రప్పించారు. మరో వైపు మిషన్ల ద్వారా ఇప్పటివరకూ సాగిన పనులలో పేరుకుపోయి ఉన్న శిధిలాలను, లోపల చిక్కుపడ్డ యంత్రాలను కూడా వెలికితీసే మరో పని కూడా ఆదివారం శరవేగంగా చేపట్టేందుకు యత్నించినా ఇందులోనూ అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News