Sunday, November 24, 2024

జగిత్యాల గడ్డ.. ఎవరి అడ్డా?

- Advertisement -
- Advertisement -

(సిహెచ్. శ్రీనివాసరావు/జగిత్యాల ప్రతినిధి)
జగిత్యాల గడ్డపై గెలిచి నిలిచేందుకు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎంఎల్‌సి తాటిపర్తి జీవన్‌రెడ్డి బరిలో నిలువగా, బిఆర్‌ఎస్ పార్టీ నుండి ప్రస్తుత ఎంఎల్‌ఏ డా.సంజయ్‌కుమార్ పోటీలో నిలిచారు. భారతీయ జనతా పార్టీ నుండి మున్సిపల్ మాజీ చైర్మెన్ బోగ శ్రావణి పోటీకి దిగారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి తాటిపర్తి జీవన్‌రెడ్డి, బిఆర్‌ఎస్ నుండి డా,ఎం.సంజయ్‌కుమార్‌లు పోటీపడగా జీవన్‌రెడ్డిపై 60 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో సంజయ్‌కుమార్ విజయం సాధించారు.

ఈ ఐదేళ్లలోప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలతో ఈ ఎన్నికల్లో సైతం తానే విజయం సాధిస్తానని సంజయ్‌కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత బాగా కనిపిస్తోందని, ఆ ప్రభావంతో పాటు తాను గెలిచినా, ఓడినా ప్రజల మద్యలోనే ఉంటూ సేవలందిస్తుండడంతో ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తన విజయం ఖాయమని జీవన్‌రెడ్డి చెబుతున్నారు. ఇక బిజెపి అభ్యర్థిగా బరిలో నిలిచిన బోగ శ్రావణి సైతం నేనే గెలుస్తానంటూ ప్రచారాన్ని ఉదృతం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే అన్ని పార్టీల ప్రచారంలో అదే జనం కనిపిస్తుండడంతో ఓటర్లు ఎవరికి విజయాన్ని కట్టబెడతారో తెలియని పరిస్థితి నెలకొంది.

కాంగ్రెస్ అభ్యర్థి విస్తృతం ప్రచారం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్‌రెడ్డి గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆరు సార్లు ఎంఎల్‌ఏగా, రెండు సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు ప్రస్తుతం పట్టభద్రుల ఎంఎల్‌సిగా కొనసాగుతున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి బిఆర్‌ఎస్ అభ్యర్థి అయిన సంజయ్‌కుమార్‌పై 60 వేల ఓట్ల పైచిలుకు తేడాతో ఓటమి చవిచూశారు. కాగా తదనంతరం జరిగిన పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు జీవన్‌రెడ్డికి భారీ మెజార్టీని కట్టబెట్టారు. ఎంఎల్‌సిగా, ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపడంతో పాటు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తున్నారు. ఈ సారి ఎంఎల్‌ఏగా విజయం సాదించాలనే పట్టుదలతో జీవన్‌రెడ్డి అన్ని శక్తియుక్తులను ఒడ్డుతూ ముందుకు సాగుతున్నారు.

గెలుపుపై బిఆర్‌ఎస్ ధీమా
బిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డా.ఎం.సంజయ్‌కుమార్ ఈ సారి కూడా తనదే గెలుపంటూ ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. గత పాలకుల నిర్లక్షం వల్ల జగిత్యాల ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందని, తెలంగాణ ప్రభు త్వం ఏర్పడిన తరువాతే గణనీయమైన అభివృద్ది సాధించామని పేర్కొంటూ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. అభివృద్ది, సంక్షేమంతో పాటు నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించడం తనకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. ప్రము ఖ నేత్ర వైద్యుడిగా వేలాది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించానని, ప్రతీ గ్రామంలో పదుల సంఖ్యలో పేరుతో పలకరించేంత సాన్నిహిత్యం ఉందంటున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రేమాభిమానాలు చూపుతూ తన అడుగులో అడుగై నడుస్తున్నారని, గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు సాధించి మరోమారు జగిత్యాల గడ్డపై బిఆర్‌ఎస్ జెండా ఎగరేస్తాననే ధీమాతో ఉన్నారు.

మార్పు తెస్తామంటూ బిజెపి ప్రచారం
భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన భోగ శ్రావణి జగిత్యాల రాజకీయాల్లో సరికొత్త మార్పు తెస్తానంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బిఆర్‌ఎస్ కౌన్సిలర్‌గా గెలుపొంది మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని అధిరోహించిన శ్రావణి పార్టీలో పొసగక తన కౌన్సిలర్, చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసి బిఆర్‌ఎస్ పార్టీని వీడి బిజెపిలో చేరారు. బిజెపి సీనియర్ నేతలను కాదని శ్రావణికి టికెట్ కేటాయించగా, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలను ఓడించడమే తన ధ్యేయమంటూ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. 40 ఏళ్లు గా రాజకీయాల్లో కొనసాగుతున్న జీవన్‌రెడ్డి జగిత్యాలకు చేసిందేమీలేదని, ప్రతీసారి ఇదే చివరి ఎన్నికంటూ పోటీలో నిలుస్తున్నారని, ఈ సారి యువతకు పట్టం కట్టాలని ఆమె కోరుతున్నారు.

అలాగే తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పాలన నడుస్తోందని, నిరుద్యోగ యువతకు ఉద్యో గ, ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో తనను గెలిపిస్తే నిరుద్యోగ యువత తరపున కొట్లాడతానని, బిఆర్‌ఎస్‌ను గద్దె దించితే తప్పా మనకు మేలు జరగదంటూ యువతను తట్టిలేపుతున్నారు. అయితే ఈ ముగ్గురు అభ్యర్థులు ఎవరికి వారు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా ఓటర్లు మాత్రం ఎవరివైపు మొగ్గు చూపుతారో తెలియని పరిస్థితి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News