అభిషేకాలు, పూజలతో మార్మోగిన శివాలయాలు
శివనామస్మరణతో నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భక్తులతో శివాలయాలు నిండిపోయాయి. కార్తీక పౌర్ణమి వేళ రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకొని అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పలుచోట్ల భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. కార్తీక పౌర్ణమి కారణంగా తెల్లవారుజామున నుంచే శివుడి దర్శనానికి భక్తులు అధిక సమయం వేచి ఉన్నారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. కృష్ణా, గోదావరి నదుల్లో భక్తులు స్నానాలు చేసి మహిళలు దీపాలు వెలిగించారు. భోళాశంకరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో దేవాలయాలు భక్తులతో సందడిగా మారాయి.
గోదావరి నదిలో పెద్ద ఎత్తు పుణ్యస్నానాలు
కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు, హుజుర్‌నగర్‌లో శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఖమ్మంలో శివాలయాలు కార్తీక పూజలతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున మూడు గంటల నుంచే మహిళలు భారీ సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. కార్తీకదీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, గుంటు మల్లేశ్వరాలయ, సుగ్గుల వారి తోట శివాలయాలు భక్తుల రద్దీతో నిండిపోయాయి. భద్రాచలంలోని గోదావరి నదిలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వదిలారు. అనంతరం ఆలయాల వద్ద పూజలు నిర్వహించారు.
ధర్మగుండంలో పుణ్యస్నానాలను ఆచరించిన భక్తులు
హైదరాబాద్ పరిధిలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. కార్తీక సోమావారం సందర్భంగా నగరంలోని పలు శివాయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీకమాసం కావడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలను ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు.
వెయ్యి స్తంభాల ఆలయంలో…
ఓరుగల్లులోని వెయ్యి స్తంభాల ఆలయంలో కార్తీక మాస శోభ సంతరించుకుంది. కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని దీపాలు వెలిగించారు. సంగారెడ్డిలోని పోతిరెడ్డి పల్లిలో శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో సూర్యోదయానికి ముందు నుంచే దీపాలను వెలిగించి భక్తులు మొక్కులను తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణం అంతా పిండి పదార్థంతో తయారు చేసిన దీపాలను వెలిగించారు.
భక్తిశ్రద్ధలతో స్వామివారికి పూజలు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు కార్తీకదీపం వెలిగించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించారు. అటు సిద్దిపేట జిల్లాలో కూడా అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి ఉసిరి, పిండి దీపాలు వెలిగించారు. హన్మకొండ జిల్లా పరకాలలోని శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి ఆలయం, హన్మకొండ రుద్రేశ్వర స్వామి సిద్ధేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం, రామప్ప, పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయం, కురవి వీరభద్ర స్వామి, అయినవోలు మల్లికార్జున స్వామి ఆలయాల్లో ఉదయం నుంచి భక్తులు క్యూలైన్‌లో నిల్చుని పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి.
మల్లికార్జున స్వామికి సంప్రోక్షణ
వరంగల్, అన్నవరం, ద్వారకా తిరుమలలోని భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీరంగూడలోని ప్రముఖ దేవాలయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కూడా భక్తులు కార్తీక పూర్ణిమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికార్జున స్వామికి సంప్రోక్షణ నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో కార్తీక మాసంలో ఆలయాలన్నీ కళకళలాడాయి. కార్తీక పూర్ణిమ సందర్భంగా శ్రీశైలం, ద్రాక్షారామం, వేములవాడ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.