నా కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగం చేసింది
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన
అమరుల కుటుంబాల బాధ ఏమిటో నాకు తెలుసు
ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజల పోరాటంతో తెలంగాణ ఏర్పడిందని, ఎందరో అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కొడంగల్, భువనగిరితో పాటు పలు నియోజక వర్గాల్లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొని ప్రియాంకగాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూనా కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగం చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాల బాధ ఏమిటో తనకు తెలుసని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
ఉద్యమాల్లో అమరులైన వారి త్యాగం వృథా కాకూడదని, అమరుల ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలని ప్రియాంక సూచించారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నేరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పుడు అత్యంత కీలకమైన సమయం వచ్చింద న్నారు. నోట్ల రద్దు సమయంలో, కరోనా కష్టకాలంలో, జీఎస్టీ విధించిన సమయంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారని అటువంటి క్లిష్ట సమయంలో సైతం ప్రభుత్వం నుంచి సామాన్య ప్రజలకు ఎలాంటి సాయం అందలేదన్నారు.