హైదరాబాద్: తెలంగాణలో దొరల సర్కార్ పోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోతున్నాయని మండిపడ్డారు. నాంపల్లిలో రాహుల్ ప్రసంగించారు. తనపై పిఎం మోడీ 24 కేసులు పెట్టించారని, ఒవైసిపై ఒక్క కేసు ఉండదన్నారు. మోడీ, ఒవైసి, కెసిఆర్ ఒక్కటేనని చెప్పారు. బిజెపి విభజన రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలపై ఇడి, ఐటి దాడులు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. బిజెపి ఇచ్చిన లిస్టుతోనే ఎంఐఎం అభ్యర్థులను ప్రకటిస్తుందని ఎద్దేవా చేశారు.
ఏం చేసినా బిజెపి, బిఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి వస్తాయన్నారు. ఢిల్లీలో మోడీని ఓడించాలంటే ఇక్కడ కెసిఆర్‌ను ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో బిజెపికి అన్ని రకాలుగా బిఆర్‌ఎస్ సహకరించిందని, నోట్ల రద్దు, జిఎస్‌టిలో బిజెపికి బిఆర్‌ఎస్ మద్దతు తెలిపన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రజల సర్కార్ వస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని, కాళేశ్వరంలో జరిగిన అవినీతి వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందన్నారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు ప్రాజెక్టు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని అడిగారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం ఇచ్చింది కాంగ్రెస్ అని తెలియజేశారు. ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేసింది కూడా కాంగ్రెస్ అని రాహుల్ చెప్పారు. బిజెపి, బిఆర్‌ఎస్ పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. రూ.1200 కు పెరిగిన గ్యాస్ సిలిండర్‌ను రూ.400 కే ఇస్తామన్నారు.