Saturday, December 21, 2024

రాహుల్‌తో ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, జిహెచ్‌ఎంసి కార్మికుల సమస్యల ఏకరువు

- Advertisement -
- Advertisement -

ఈఎస్‌ఐ, పిఎఫ్ ఇప్పించాలి
ప్రమాద బీమా కల్పించాలి
కస్టమర్లు, కంపెనీల మధ్య ఇరుక్కుపోతున్నాం

మనతెలంగాణ/హైదరాబాద్: ఈఎస్‌ఐ, పిఎఫ్ ఇప్పించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, జీహెచ్‌ఎంసి కార్మికులు కోరారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండగా, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, జీహెచ్‌ఎంసి కార్మికులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. డెలివరీ బాయ్‌ల దినచర్య ఎలా ఉంది? ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని రాహుల్ వారిని అడిగారు. వారి సమస్యలను, ఇబ్బందులను రాహుల్ శ్రద్ధగా విన్నారు.

డెలివరీ బాయ్స్ తమ సమస్యను పరిష్కరించాలని రాహుల్ గాంధీని కోరారు. ప్రమాదాలు జరిగినా, సరుకులు పోయినా డెలివరీ ఏజెన్సీలు పట్టించుకోవడం లేదని డెలివరీ బాయ్స్ ఆవేదన వ్యక్తం చేశారు. కస్టమర్లు, కంపెనీల మధ్య ఇరుక్కుపోతున్నామని, కుటుంబాన్ని పోషించుకోవాలంటే బాధలు తప్పడం లేదంటూ వారు వాపోయారు. దీనికితోడు పెట్రోల్ ధరను కంపెనీ చెల్లించడం లేదని, ఆఖరి నిమిషంలో వినియోగదారుడు రద్దు చేసుకుంటే ఆ భారం కూడా తమపైనే పడుతుందని వారు పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ విషయంపై దృష్టి సారించి రాజస్థాన్‌లో చేసిన విధంగా ఇక్కడ కూడా సంక్షేమ చర్యలు చేపడతామని రాహుల్ వారికి హామీనిచ్చారు.

నిరంతరం స్వీపింగ్ చేయడంతో ఛాతీలో నొప్పి…
జీహెచ్‌ఎంసి ఉద్యోగులు తమకు పింఛన్ రావడం లేదని వాపోయారు. నిరంతరాయంగా స్వీపింగ్ చేయడం వల్ల ఛాతీలో విపరీతమైన నొప్పి వస్తుందని వారు రాహుల్‌తో చెప్పారు. ప్రమాద బీమా కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసి కాంట్రాక్టు ఉద్యోగులను వేధిస్తున్నారని కార్మికులు ఆరోపించారు. రెండు పడకల గదులు ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని కాంట్రాక్టర్లు 11 గంటలు పని చేయిస్తున్నారని వారు వాపోయారు. తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పారిశుద్ధ్య కార్మికులు తమ ఆవేదనను రాహుల్ ముందు వెళ్లబోసుకున్నారు.

పోలీసులు ఛలాన్లతో వేధిస్తున్నారు: క్యాబ్ డ్రైవర్లు
పోలీసులు ఛలాన్లతో వేధిస్తున్నారని క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు రాహుల్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ విన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సిఎం, మంత్రులతో సమావేశమై ఈ సమస్యలు పరిష్కరిస్తారనిని హామీ ఇచ్చారు.

ఆటోలో చక్కర్లు కొట్టిన రాహుల్
ఈ కార్యక్రమం అనంతరం తనను ఆటోలో సిటీ తిప్పాలని ఓ ఆటో డ్రైవర్‌ను రాహుల్ కోరారు. ఈ నేపథ్యంలో ఫంక్షన్‌హాల్ నుంచి యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్ వరకు అజారుద్దీన్‌తో కలిసి రాహుల్ ఆటోలో ప్రయాణించారు. రాహుల్ గాంధీ ఆటోలో కనిపించేసరికి ఆయన్ను చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు. నగరంలో ఎన్నికల ప్రచారం, పార్టీ బలబలాలపై అజారుద్దీన్‌తో రాహుల్ గాంధీ ఆటోలో చర్చించారు. రాహుల్ గాంధీ కొద్ది సేపు ఆటోలో కూర్చొని చక్కర్లు కొట్టారు. ఆ సమయంలో రాహుల్ వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Rahul Gandhi interacts with auto drivers

Rahul Gandhi interacts with auto drivers

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News