హుజూరాబాద్ : కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఎంపిడీవో ఫిర్యాదుతో పిఎస్ లో కేసు నమోదు చేశారు. మంగళవారం ప్రచారంలో కౌశిక్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే విచారణకు ఆదేశించింది.
నిన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి తనను గెలిపించకపోతే చచ్చిపోతానంటూ బెదిరించారు. ‘ఓటు వేసి గెలిపిస్తే విజయయాత్రకు వస్తా. లేకపోతే 4వ తేదీన నా శవయాత్రకు రండి’ అంటూ ఓటర్లను బెంబేలెత్తించారు. ‘మీ కాళ్లు పట్టుకుంటా ఒక్కసారి అవకాశం ఇవ్వండి’ అంటూ వేడుకున్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో స్పందించిన ఎన్నికల కమిషన్… కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక పంపించాలని హుజురాబాద్ ఎన్నికల అధికారులను ఆదేశించింది.