Saturday, January 11, 2025

పాక్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన అంజూ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భర్త, ఇద్దరు పిల్లలను విడిచిపెట్టి ఎవరికీ చెప్పకుండా అకస్మాత్తుగా పాకిస్థాన్‌కు గత జులై 27న వెళ్లిపోయిన అంజు బుధవారం రాత్రి భారత్‌కు వచ్చేసింది. పాకిస్థాన్, పంజాబ్ సరిహద్దు లోని వాఘా మీదుగా భారత్ లోకి ప్రవేశించిన ఆమెను దర్యాప్తు అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. బీఎస్‌ఎఫ్ క్యాంప్ వద్ద విచారించారు . అక్కడి నుంచి అమృత్‌సర్ విమానాశ్రయానికి, తరువాత ఢిల్లీకి విమానంలో అధికారులు తరలించారు. అంజు పాకిస్తాన్‌కు ఎందుకు వెళ్లింది? అక్కడ ఏం జరిగింది ? మళ్లీ భారత్‌కు తిరిగి రావడం వెనుక అసలు కారణాలు ఏమిటని అధికారులు విచారించే అవకాశాలు ఉన్నాయి.

ఫేస్‌బుక్ స్నేహితుడిని కలుసుకోడానికి పాకిస్తాన్‌కు వెళ్లానని మొదట్లో చెప్పిన అంజూ ఆ తరువాత అతడిని పాక్‌లో పెళ్లి చేసుకుంది. ఈ వ్యవహారం ఈ ఏడాది జులై నెలలో చర్చనీయాంశం అయింది. బుధవారం రాత్రి భారత్‌కు తిరిగొచ్చిన ఆమె ఏ పనులపై మళ్లీ భారత్‌కు వచ్చిందన్నది వెల్లడించింది. రాజస్థాన్ లోని భీవాడీ జిల్లాకు చెందిన అరవింద్ అనే వ్యక్తితో అంజూకు చాలా ఏళ్ల క్రితమే పెళ్లయింది. ఆమెకు 15 ఏళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురు ఉన్నారు. అయితే ఫేస్‌బుక్‌లో పాక్‌కు చెందిన నస్రుల్లాతో పరిచయం పెరిగి 2019 నుంచి అతడితో చిట్ చాటింగ్ చేస్తూంది. చివరకు ఇది ప్రేమాయణంగా మారి ఈ ఏడాది జులై 27న పాకిస్తాన్‌కు వెళ్లి పోయింది.

జైపూర్ లోని బంధువుల ఇంటికి వెళ్తున్నట్టు భర్తకు చెప్పింది. చివరకు పాకిస్తాన్‌లో ప్రియుడి వద్దకు చేరిందన్న సంగతి సోషల్ మీడియా ద్వారా భర్తకు తెలిసింది. తాను కేవలం స్నేహితుడిని కలిసేందుకు మాత్రమే వచ్చానని , మళ్లీ వెనక్కు వెళ్లి పోతానని మొదట్లో అంజూ చెప్పినా, తరువాత అతడినే పెళ్లి చేసుకుంది. తన పేరును ఫాతిమాగా మార్చుకున్నట్టు వెల్లడించింది. వీరిద్దరి ప్రేమ పెళ్లికి బహుమతిగా అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారి మొహసీన్ ఖాన్ అబ్బాసీ కొంత భూమిని, డబ్బును కూడా ఇవ్వడం చర్చనీయాంశం అయింది. తిరిగి ఆమె ఇక రాదని భర్త నిశ్చయించుకున్నాడు. కానీ నాలుగు నెలల్లో మళ్లీ భారత్‌కు ఆమె తిరిగి వచ్చేసింది.

బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడిన అంజూ తనకు పిల్లలంటే చాలా ఇష్టమని, వారు లేకుండా ఉండలేక పోతున్నానని, అందుకే వారిని తనతో తీసుకెళ్లాలని తిరిగి భారత్‌కు వచ్చినట్టు వివరించింది. చట్టపరంగా భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత పిల్లలను తీసుకెళ్తానని పేర్కొంది. దీనిపై భర్త అరవింద్ స్పందిస్తూ ఆమె గురించి మాట్లాడేందుకు తనకు మనస్కరించడం లేదని, ఆమె పేరును తన వద్ద ప్రస్తావించ వద్దని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News