Friday, December 20, 2024

ముంచుకొస్తున్న ‘మిచాంగ్’

- Advertisement -
- Advertisement -

రేపటి నుంచి రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం : ఐఎండి

వివిధ విభాగాల అధికారులతో అదనపు జనరల్ మేనేజర్ సమీక్ష

మనతెలంగాణ/హైదరాబాద్: ‘మిచాంగ్’ సైక్లోనిక్ తుఫాను పరిస్థితి దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఆర్.ధనంజయులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాను పరిస్థితుల దృష్ట్యా పాటించాల్సిన జాగ్రత్తలపై విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్‌లతో వివిధ విభాగాల ప్రిన్సిపల్ హెడ్స్‌తో ఆయన ఈ సమావేశం నిర్వహించారు. రైలు కార్యకలాపాలకు భద్రత కల్పించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అందులో భాగంగా అదనపు జనరల్ మేనేజర్ తుఫాను పరిస్థితి గురించి సమీక్షించారు. వివిధ ప్రదేశాల్లో తుఫాను పరిస్థితులు ఎదుర్కొనేందుకు సరిపడే విధంగా స్టాక్‌ను అమార్చుకోవాలని ఆయన సూచించారు. నిరంతర పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని రైల్వే అధికారులతో ఆయన తెలిపారు. తుఫాన్ గమనాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ సరిపడా చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. ప్రభావితమయ్యే సెక్షన్‌లలో మాన్సూన్ పెట్రోలింగ్ చేపట్టాలని ఆయన సూచించారు. బ్రిడ్జీల దగ్గర ఇతర ప్రభావిత ప్రదేశాల్లో వాచ్‌మెన్‌లను నియమించాలని ఆయన సూచించారు. పెద్ద వృక్షాలు ట్రాక్‌లో పడిపోతున్న నేపథ్యంలో మాన్సూన్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, అన్ని బలహీనమైన వంతెనలు, ప్రదేశాల్లో అధికారులందరూ నైట్ పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని ఆయన నిర్ణయించారు.

సర్వీసుల షెడ్యూల్‌లో మార్పు
తుఫాను పరిస్థితి కారణంగా భారీ వర్షాలు, రాబోయే తీవ్రమైన తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని దక్షిణ కోస్తా ప్రాంతంలో తుఫాను వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, రానున్న రెండు రోజుల్లో ఈ ప్రాంతంలో రైలు సర్వీసుల షెడ్యూల్‌లో మార్పు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో ప్రభావిత సెక్షన్లలో నడపాల్సిన రైలు సర్వీసులను మార్చడం లేదా పరిస్థితికి అనుగుణంగా వాటిని దారి మళ్లీంచడం, రీషెడ్యూల్ చేయడం, పాక్షికంగా రద్దు చేయడం లేదా పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉందని దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఏదైనా రైలు సంబంధిత విచారణ కోసం, ప్రయాణికులు సమీపంలోని రైల్వేస్టేషన్‌లోని అధికారులను సంప్రదించాలని దక్షిణ మధ్య రైల్వే, ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సిహెచ్. రాకేశ్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News