Monday, December 23, 2024

అసమానతలపై అసమాన పోరాటం

- Advertisement -
- Advertisement -

రెండో కుమారుడు గంగాధర్ చనిపోయినపుడు డైరీలో బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసుకున్న వాక్యాలు ఈ క్రింది విధంగా వున్నాయి. ‘నాకు రెండవ కొడుకు గంగాధర్ పుట్టాడు. చూడడానికి చాలా అందమైన వాడు. గంగాధర్ అకస్మాత్తుగా జబ్బు పడ్డాడు. వైద్యం కోసం అవసరమైన డబ్బులు లేవు. గంగాధర్ అనారోగ్యంతో ఒక్కసారిగా నా మనసు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఊగిసలాటలో పడింది. తిరిగి నాకు ఇలా ఆలోచన వచ్చింది. ఒకవేళ నేను ఉద్యోగం చేసేటట్లయితే 7 కోట్ల అంటరాని వాళ్ళ గతి ఏమవుతుంది. వాళ్ళు నా కొడుకు గంగాధర్ కంటే తీవ్రమైన అనారోగ్యం పాలై వున్నారు. సరైన వైద్యం చేయించని కారణంగా ఆ పసి పిల్లవాడు రెండున్నర సంవత్సరాల అల్ప వయసులోనే చనిపోయాడు. వీధిలోని జనం వచ్చారు. అందరూ పిల్లవాడి మృతదేహాన్ని కప్పేందుకు కొత్త గుడ్డ తీసుకు రమ్మన్నారు. గుడ్డ తేవడానికి నా దగ్గర డబ్బులు లేవు. చివరికి నా ప్రియమైన భార్య తన చీర నుంచి ఒక ముక్క చించింది. ఆ చీర ముక్క ఆ పిల్లవాడి మృతదేహంపై కప్పి జనం శ్మశానానికి తీసుకు వెళ్లారు. తర్వాత భూమిలో మృత దేహాన్ని పాతిపెట్టారు. అలాంటిది నా ఆర్థిక పరిస్థితి.’

అలాంటి కఠినమైన కడు పేదరికపు రోజుల్ని నేను చూశాను. అలాంటి కఠినమైన అనుభవాలు ఏ నాయకుడికీ ఎదురు కాకూడదు.‘అంబేద్కర్ ఆనాడు తాను ఎదుర్కొన్న పరిస్థితులు ఈనాటి సమాజంలో అనేక మంది అణగారిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. అందుకే ఆయన ఇలా అంటారు. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకోసం దేవుని మీద కానీ, మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు’ అని అన్నారు డా. బి.ఆర్. అంబేద్కర్. ఈ నినాదం బట్టి మనకు ఆయన గొప్ప ఆచరణవాదని తెలుస్తుంది. బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారత దేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహా మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్. భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్‌లో సైనిక స్థావరమైన మహోం అను ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్‌లో) రాంజీ మలోజీ సాక్పాల్, భీమాబాయ్ దంపతుల 14వ, చివరి సంతానంగా జన్మించారు.

మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించిన కాలమది. వేసవి సెలవుల్లో మామగారున్న గోరెగావ్‌కు భీమ్‌రావ్, అన్న, మేనల్లుళ్ళతో పాటు వెళ్ళారు. అనుకున్నట్లు, మామ స్టేషన్‌కు రాలేకపోయారు. స్టేషన్ నుండి గ్రామానికి వెళ్ళడానికి బండిని కుదుర్చుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత బండివాడికి, వీళ్ళు మెహర్ కులస్థులని తెలిసింది.అందరినీ బండి నుండి దిగమన్నాడు. ఎండాకాలం పిల్లలు ఆ బండివాణ్ణి బతిమాలు కొన్నారు. రెండింతలు బాడుగ ఇస్తామన్నారు. భీమ్‌రావ్ అన్న బండి తోలేటట్లు, బండివాడు నడచి వచ్చేటట్లు మాట్లాడుకున్నారు. ఆకలిదప్పులతో అలమటిస్తూ అర్ధరాత్రికి గోరేగావ్ చేరారు పిల్లలు. వీధి కుళాయి నీరు తాగుతూ వున్న భీమ్‌రావ్‌ను కొట్టి మంచి నీరు తాగకుండా గెంటివేశారు. కులం పేర భీమ్‌రావ్‌ను అవమానాలకు గురి చేశారు. అనేక అవమానాలు ఎదుర్కొంటూనే బిఎ ఉత్తీర్ణులైన అంబేద్కర్.. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌తో పాటు ఎన్నో ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించారు. ఎంఎ, పిహెచ్‌డి, న్యాయశాస్త్రంలో పిహెచ్‌డి పూర్తి చేశారు. విదేశాలలో ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు.

ఇండియాకు తిరిగొచ్చి దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టారు. ఇలాంటి సమస్యలను ఎదిరించాలంటే చదువొక్కటే మార్గమని భావించారు. తనలా అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కోకూడదని, చిన్నప్పటి నుంచే తనను తాను రక్షించుకోవడమే కాకుండా, అంటరానితనాన్ని నిర్మూలించే ప్రయత్నం చేశారు. తన వర్గంలోని ప్రజలకు అంబేడ్కర్ చదువు చెప్పించి ప్రోత్సహించారు. ‘బహిష్కృత హితకారిణి’ అనే సంస్థను స్థాపించారు. అంటరానితనంపై పోరాటం చేశారు.. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని, మనుధర్మాన్ని వ్యతిరేకించారు. 1927లో దళిత జాతుల మహాసభ జరిగింది.. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి కొన్ని వేల మంది వచ్చారు. మహత్ చెరువులోని నీటిని తాగడానికి వారికి అనుమతి లేకపోగా.. అంబేడ్కర్ ఆ చెరువులోని నీటిని తాగారు. చరిత్రలో అదో సంచలనం.
తరతరాలుగా బడుగు, బలహీన వర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అంబేడ్కర్.. వారి అభ్యున్నతకి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే అంటరానితనం, అస్పృశ్యతను శిక్షార్హమైన నేరంగా చేశారు. అంతేకాదు ఆర్థికవేత్తగా కూడా ఎంతో గొప్పగా పేరు సంపాదించారు. పారిశ్రామికీకారణ, వ్యవసాయాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మారు.

లండన్‌లో జరిగిన మూడు రౌండ్ టేండ్ సమావేశాలకు హాజరయి నిమ్నవర్గాల హక్కుల కోసం గళమెత్తారు. అంబేడ్కర్ పెక్కు గ్రంథాలు రాశారు. ‘ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ’, ‘ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా’, ‘ది బుద్ధా అండ్ కార్ల్ మార్క్, ‘ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ’ ప్రధానమైనవి. ప్రసిద్ధ రచయిత బెవెర్లి నికొలస్ డాక్టర్ అంబేడ్కర్ భారత దేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు. అంబేడ్కర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికైన తర్వాత వారసత్వ, వివాహ చట్టాలలో లింగ సమానత్వాన్ని వివరించడానికి ప్రయత్నించిన హిందూ కోడ్ బిల్లు ముసాయిదాను పార్లమెంటులో నిలిపివేయడంతో.. 1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. జీవిత చరమాంకంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అంబేడ్కర్ తన జీవితంలోని ముఖ్యాంశాలను తన ఆత్మకథ ‘వెయిటింగ్ ఫర్ ఏ వీసా’లో వివరించారు. జీవితాంతం నిమ్నవర్గాల హక్కులకోసం ఎనలేని పోరాటం చేసిన అంబేడ్కర్ తీవ్రమైన అనారోగ్యంతో 1956 డిసెంబర్ 6న తుది శ్వాస విడిచారు.
అంబేడ్కర్ ఈ దేశ ప్రజల ఉమ్మడి ఆస్తి.

ఆయన ఆలోచనలు, ఆదర్శాలు నేటి తరానికే కాక భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తిదాయకం. ఆయన రాసిన రాజ్యాంగం 1949 నవంబర్ 26 న రాజ్యాంగ పరిషత్తు చేత ఆమోదించబడింది. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుతున్నారు. దీని ద్వారా పౌరులకు ప్రాథమిక హక్కులు ఇవ్వబడ్డాయి. అంబేడ్కర్‌ను ఏ ఒక్క కులానికో, మతానికో ఆపాదించలేము.ఆయన్ను కులాలకు, మతాలకు పరిమితం చేయడం అంటే ఆ మహనీయుడిని తక్కువ చేసి చూడటమే అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News