Monday, December 23, 2024

గవర్నర్లకు సుప్రీం తాఖీదు!

- Advertisement -
- Advertisement -

శాసన సభలు మరొకసారి ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతికి నివేదించే అధికారం గవర్నర్లకు లేదని సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వం పిటిషన్‌పై శుక్రవారం నాడు చేసిన స్పష్టీకరణ రాజ్‌భవన్ల విషయంలో ఒక కొత్త లక్ష్మణ రేఖ వంటిది. ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు పంపుతున్న బిల్లులను నెలలు, సంవత్సరాల తరబడిగా తమ వద్ద వుంచుకొని బూజుపట్టిస్తున్న గవర్నర్లందరికీ ఇది తాజా హెచ్చరిక. ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాల బిల్లుల విషయంలోనూ, ఇతర సందర్భాల్లోనూ అక్కడి గవర్నర్లు ఎంత మొండిగా వ్యవహరిస్తున్నారో గత కొంత కాలంగా చూస్తున్నదే. వారు రాజ్యాంగంలో చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ భారత ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేస్తున్న సంగతి ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా పదే పదే రుజువు అవుతున్నది. వారిని రాజ్‌భవన్లకు పంపిస్తున్న కేంద్ర పాలకులు కూడా దీనిని చూస్తూ ఊరుకొంటున్నారే గాని, ఆ గవర్నర్లను దారికి తెచ్చి వారి వల్ల రాజ్యాంగానికి అంత వరకు జరిగిన అపచారాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయడం లేదు.

నాడు పశ్చిమ బెంగాల్ విషయంలో అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్, ప్రస్తుత భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధంఖడ్ నుంచి నేటి తమిళనాడు గవర్నర్ టిఎన్ రవి వరకు ముఖ్యమంత్రులతో తరచూ పేచీలు పెట్టుకోడం వెనుక కేంద్రం హస్తమున్నదని నమ్మడానికి ఆస్కారం కలుగుతున్నది. ప్రతిపక్ష ముఖ్యమంత్రులను, వారి ప్రభుత్వాలను ఎంతగా ముప్పు తిప్పలు పెడితే అంతగా కేంద్ర పాలకులు తమను మెచ్చుకొంటారనే దృష్టితోనే వీరు నడుచుకొంటున్నారు. సుప్రీం కోర్టు హితవచనాలు గాని, దాని తీర్పులు గాని వీరిని దారిలో పెట్టలేకపోడం ప్రత్యేకించి గమనించవలసిన విషయం. పంజాబ్ గవర్నర్ బన్వరీ లాల్ పురోహిత్ అక్కడి ఆప్ ప్రభుత్వాన్ని ఏ విధంగా చిన్నచూపు చూస్తున్నారో గమనిస్తే ఎవరికైనా జుగుప్సకలుగక మానదు. శాసన సభను సమావేశపరచవలసిందిగా ఆ రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫార్సును కూడా ఆయన ఖాతరు చేయలేదు. గవర్నర్లు మంత్రివర్గ సిఫార్సు మేరకే పని చేయాలని రాజ్యాంగం ఎటువంటి అనుమానాలకు చోటు లేకుండా స్పష్టం చేసిన సంగతి ఈ పురోహిత్‌కు తెలియదని అనుకోవాలా, నిపుణులైన ఆయన సలహాదార్లు ఆ విషయం ఆయనకు చెప్పలేదని భావించాలా! తన వైఖరిని సుప్రీం కోర్టులో పంజాబ్ ప్రభుత్వం సవాలు చేసిన మీదట పురోహిత్ శాసన సభను సమావేశపరచక తప్పలేదు.

అయితే అసెంబ్లీ ఆమోదంతో ప్రభుత్వం పంపిన ఐదు బిల్లులను మాత్రం ఆయన పెండింగ్‌లో పెట్టారు. వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసినప్పుడల్లా పరిశీలనలో వున్నాయని సమాధానం చెబుతున్నారు. ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా బిల్లులను నిరవధికంగా తన వద్ద వుంచుకొనే అధికారం గవర్నర్‌కు లేదని గత నెల పదో తేదీన సుప్రీం కోర్టు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని గుర్తు చేసినప్పటికీ పురోహిత్ వైఖరిలో మార్పు రాలేదు. గవర్నర్లు పదవీ స్వీకార ప్రమాణం చేసినప్పుడే రాజ్యాంగాన్ని కాపాడుతామని, దానికి మద్దతుగా నిలుస్తామని మాట ఇస్తారు. గవర్నర్ల విధి విధానాలను గురించి రాజ్యాంగం వివరంగా తెలియజేసింది. వారు మంత్రి మండలి సలహా మేరకే తమ కార్యనిర్వాహక అధికారాలను వినియోగించాలని 154వ అధికరణ స్పష్టం చేస్తున్నది. దీని ప్రకారం గవర్నర్ కేవలం రాజ్యాంగాధిపతే గాని, తన చేతిలో అసలు అధికారాలు అణుమాత్రం కూడా వుండవు. రాజ్యాంగం 200 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపించే బిల్లులను ఆమోదించడం లేదా రాష్ట్రపతికి నివేదించడం మాత్రమే గవర్నర్లు చేయగలరు. ఒకసారి వారు తిప్పి పంపిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం శాసన సభ ముందుంచి తిరిగి దాని ఆమోదం పొంది పంపించినప్పుడు వాటి మీద ఆమోద ముద్ర వేయడం తప్ప గవర్నర్‌కు వేరే మార్గం లేదు.

తమిళనాడు గవర్నర్ విషయంలో సుప్రీం కోర్టు ఈ విషయాన్నే మరింత స్పష్టంగా నిర్వచించింది. గవర్నర్లు రెండవసారి తమ వద్దకు వచ్చిన బిల్లులను రాష్ట్రపతికి నివేదించడానికి కూడా వీలు లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని త్రిసభ ధర్మాసనం శుక్రవారం నాడు వెలిబుచ్చిన అభిప్రాయం తిరుగులేనిది. అలా నివేదించడం ద్వారా ఆ బిల్లులను మరింత జాప్యానికి గురి చేసి తద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని మానసికంగా హింసించి ఆనందించే అవకాశాన్ని ధర్మాసనం పూర్తిగా మూసివేసింది. ఏటా జనవరి 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకొనే సంప్రదాయాన్ని కేంద్రంలోని బిజెపి పాలకులు 2015 నుంచి అమల్లోకి తెచ్చారు. ఆ విధంగా ఏడాదికొకసారి రాజ్యాంగానికి పూలమాల వేసి భక్తితో నమస్కారం చేసి ఆచరణలో మాత్రం దానిని అడుసులో తొక్కడం అనే ఒక దుసంప్రదాయానికి తెర తీశారు. దేశ ప్రజలు ఈ మోసాన్ని గమనించలేరనుకోడం పొరపాటు. బిల్లు తమ వద్దకు వచ్చిన తర్వాత వీలైనంత తొందరగా దానిపై గవర్నర్లు చర్య తీసుకోవాలన్నదే 200 అధికరణ ఆంతర్యమని సుప్రీం కోర్టు నిర్దేశించిన నియమాన్ని రాజ్‌భవన్లు ఇకనైనా చిత్తశుద్ధితో పాటిస్తాయని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News