రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారాన్ని దెబ్బతీస్తూ బిజెపి ముందుకు వచ్చింది. రాష్ట్రంలో అధికార పగ్గాలను చేపట్టేందుకు అనువైన ఆధిక్యతను సాధించింది. కానీ ఇక్కడ వివిధ కారణాల వల్ల బిజెపి సిఎం పదవికోసం కొత్త ముఖాలను ఎంచుకునే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో రెండుసార్లు సిఎం అయ్యి ఉండి, పార్టీలోనే కాకుండా సంఘు పరివార్‌లోనూ పట్టున్న వసుంధర రాజే సహజంగానే ప్రధాన పోటీదారుగా నిలుస్తున్నారు. ఆమె గత అనుభవం, పాలనాస్థాయి, గణనీయ మద్దతు ప్రాతిపదికలు ఈ దిశలో ఆమెను తిరుగులేకుండా చేస్తున్నాయి. కానీ ఈసారి కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ , అర్జున్‌రామ్ మేఘ్వాల్, రాష్ట్ర శాఖ అధ్యక్షులు సిపి జోషీ, దియాకుమారి కూడా విశేషరీతిలో ప్రచారం సాగించారు. వీరితో పాటు ఇతరులు కూడా తాము సిఎం అభ్యర్థులుగా తమ వర్గాల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు.
రాజస్థాన్‌లో కేంద్ర మంత్రి మేఘ్వాల్ ఎస్‌సి తెగలకు చెందిన వారు. ఇప్పుడు బిజెపి తరఫున సిఎం పోటీదార్లలో ఉన్న మహంత్ బాలాకాంత్ యాదవ కులస్తుడు. హిందీ మాట్లాడే ప్రాంతాలలో అత్యధిక సంఖ్యాబలం ఉన్న ఒబిసి వర్గంగా ఉన్న యాదవులు, హిందూత్వకు ప్రతీక అయినందున బాలాకాంత్ పేరు కూడా ఇప్పుడు సిఎం పదవి పోటీలో ప్రధానంగా ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ కీలక రాష్ట్రంలో గిరిగీసుకుని లేదా రిజర్వుడుగా ఉండే నేతలకు బదులుగా విస్తృతస్థాయి సామాజిక వర్గాల కోణంలో సిఎం ఎంపికకు దిగాలని యోచిస్తోంది. ఇటువంటి ఎంపిక వల్లనే పార్టీ రాజస్థాన్‌లోనే కాకుండా ఈ బెల్టులోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రజలు తమ పార్టీకి మద్దతు వ్యక్తం చేస్తారని కమలం పార్టీ విశ్వసిస్తోంది.