Saturday, November 23, 2024

కాలి బూడిదైన ట్రావెల్స్ బస్సు..

- Advertisement -
- Advertisement -

నల్గొండ : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారు జామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి చీరాలకు వెళుతున్న శ్రీకృష్ణా ట్రావెల్స్‌కు చెందిన బస్సు నల్లగొండ జిల్లా కేంద్రంలోలని అజ్జల బావి బైపాస్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. సోమవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఏసీ డెమో నుంచి మంటలు చేలరేగి అగ్గిరాజుకుంది. దీన్ని గమనించిన బస్సు డ్రైవర్ బస్సు ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో పెనుప్రమాదం తప్పింది. ఘటన సమయంలో బస్సులోని ప్రయాణికలు అందరూ గాఢ నిద్రమత్తులో ఉన్నారు. ఈ బస్సులో మొత్తం 38 మంది ప్రయాణిస్తుండగా అందులో చీరాలకు చెందిన ఓ యువకుడు నిద్రమత్తులో ఉండి మెళకువ రాకపోవడంతో నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమై మంటల్లో సజీవ దహనమయ్యాడు. చనిపోయిన వ్యక్తికి సంబంధించి శరీర భాగాలను పోలీసులు గుర్తించారు.

మిగతా ప్రయాణికులలో కొంత మందికి గాయాలు కావడంతో నల్గొండలోని ప్రభుత్వాసుపత్రికి, నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కొంత మంది ప్రయాణికులను పోలీసులు ప్రత్యామ్నాయ వాహనాలలో వారి స్వస్థలాలలకు పంపించారు. ఈ ప్రమాదంలో ప్రయాణికుల లగేజ్, బంగారం, ఒకరి అమెరికా వీసా కాలి బూడిదైపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది నిద్రలేచి మిగతా వారిని అప్రమత్తం చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉండేదని పలువురు పేర్కొంటున్నారు. ట్రావెల్స్ నిర్వాహకులు నిబంధనలు పాటించకపోవడంతో పాటు వాహనాలను కూడా సరైన కండీషన్లో నడపడంలో నిర్లక్ష్యం వహించడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. బస్సు డ్రైవర్ జోసెఫ్ ఫిర్యాదు మేరకు నల్గొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News