మనతెలంగాణ/హైదరాబాద్: పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రజా తీర్పును గౌరవిద్దాం..కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని ఈ సందర్భంగా కెసిఆర్ పార్టీ నేతలకు చెప్పినట్లు తెలిసింది. అధికారం నుంచి హుందాగా తప్పుకున్నామని ఆయన అన్నట్లు తెలిసింది. ఏమి జరుగుతుందో వేచి చూద్దామని, త్వరలో తెలంగాణ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేద్దాం, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతను త్వరలో ఎన్నుకుందామని కెసిఆర్ పార్టీ నేతలతో చెప్పినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కెసిఆర్‌ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. గెలిచిన ఎంఎల్‌ఎలకు కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను కలిసిన వారిలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పట్నం మహేందర్‌రెడ్డి, గెలిచిన ఎంఎల్‌ఎలతో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్‌ఎలు, పార్టీ ఇతర నేతలు ఉన్నారు.