Thursday, November 14, 2024

రాజస్థాన్ లో తెలంగాణ సీన్ రిపీట్..

- Advertisement -
- Advertisement -

తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచి, రెండు రోజులైనా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఇంకా తేలలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రావడంతోనే కుర్చీల కుమ్ములాట మొదలైందనే విమర్శలు షురూ అయ్యాయి. అయితే బీజేపీ కూడా కాంగ్రెస్ కు ఏమాత్రం తీసిపోవట్లేదు. ఆ పార్టీ తాజాగా విజయం సాధించిన రాజస్థాన్ లో ముఖ్యమంత్రిని ఎంపిక చేయలేక బీజేపీ అధిష్ఠానం కిందామీదా పడుతోంది.

రాజస్థాన్ కు కూడా తెలంగాణాతోపాటే ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 199 స్థానాల్లో బీజేపీ 115 సీట్లను గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి పదవిని వసుంధర రాజెకి ఇస్తారని అందరూ భావించినా, బీజేపీ అధిష్ఠానం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది. వసుంధర రాజేతోపాటు ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడుతున్నవారిలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర షెఖావత్, అర్జున్ రామ్ మేఘావాల్, దియా కుమారి ఉన్నారు.

మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది. ఈ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఎవరనే దానిపై రాజస్థాన్ సిఎం పదవి ఆధారపడి ఉంటుందంటున్నారు సునీల్ భార్గవ. ఆయన రాజస్థాన్ బీజేపీ స్టేట్ పాలసీ, రీసెర్చ్ వింగ్ కు అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. చత్తీస్ గఢ్ కు ఓబీసీలకు చెందిన వ్యక్తి, మధ్యప్రదేశ్ కు రాజ్ పుత్ కు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రులయితే, రాజస్థాన్ లో దళితుణ్ని ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అదే జరిగితే దళిత వర్గానికి చెందిన మేఘావాల్ నే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి వరించవచ్చు. ఈ లెక్క తేలకపోవడంవల్లనే రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించడంలో జాప్యం జరుగుతోందని సునీల్ భార్గవ చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News