చైనాలోని మకావు టవర్… ప్రపంచంలోనే రెండవ ఎత్తయిన బంగీ జంప్ చేసే ప్రదేశం. నేలకు 800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ టవర్ పైనుంచి చూస్తేనే ప్రాణాలు పోతాయేమో అనిపిస్తుంది. ఇక బంగీ జంప్ చేయడమంటే మాటలా? అయినా కొందరు సాహసికులు మకావు టవర్ పైనుంచి బంగీ జంప్ చేస్తూనే ఉంటారు.
తాజాగా జపాన్ కు చెందిన 56 ఏళ్ల వ్యక్తి ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో మకావు టవర్ పైనుంచి బంగీ జంప్ చేశాడు. జంప్ పూర్తయ్యాక అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. వైద్య సిబ్బంది వచ్చేలోగానే అతని ప్రాణం పోయింది. మకావు టవర్ నుంచి బంగీ జంప్ చేసి ప్రమాదాలను కొనితెచ్చుకున్న సంఘటనలు గతంలో కూడా జరిగాయి. రష్యాకు చెందిన ఒక టూరిస్ట్ 2018 జనవరిలో బంగీ జంప్ చేయడంలో జరిగిన పొరబాటు వల్ల గాలిలోనే వేలాడుతూ ఉండిపోయాడు. అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగి పొడవాటి నిచ్చెనల సాయంతో అతన్ని రక్షించి, నేలకు దింపాయి. మకావు టవర్ పైనుంచి బంగీ జంప్ చేయాలంటే 360 డాలర్లు చెల్లించాలి. ఇంత డబ్బు చెల్లించి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం అవసరమా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.