Friday, November 22, 2024

తెలంగాణ ఆర్థర్ కాటన్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఆర్థర్ కాటన్‌గా, తెలంగాణ నీటి పారుదల పితామహుడిగాను అభివర్ణించబడిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ తెలంగాణ గర్వించదగిన హైదరాబాదుకు చెందిన గొప్ప ఇంజినీరు. ఆయన 1877, జులై 11న హైదరాబాదులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1949 డిసెంబరు 6న హైదరాబాదులో మరణించారు. సెయింట్ జాన్ గ్రామర్ స్కూల్, నైజాం కళాశాలల్లో చదువుకున్నారు. మంచి మార్కులతో చదువులో ప్రతిభ కనబరిచారు. పలు ఉపకార వేతనాలను పొందారు. ఆయన ప్రతిభను గుర్తించిన ఆరో నిజాం ఆయనను చదువుకోవడానికి లండన్‌కు పంపారు. ఆయన ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు.

నిజాం సంస్థానంలో పబ్లిక్ వర్క్ శాఖలో ఉద్యోగంలో చేరారు. చీఫ్ ఇంజినీరింగ్ సెక్రెటరీ స్థాయికి చేరుకున్నారు. నిజాం ప్రభువు ప్రోత్సాహంతో తన హయంలో ఎన్నో నిర్మాణాలు చేపట్టారు. ప్రతి పనినీ గమనిస్తూ దగ్గరుండి నిర్మాణాలను త్వరితగతిన పూర్తయ్యేలా చేశారు. ఉస్మానియా ఆర్ట్ కళాశాల, ఉస్మానియా ఆసుపత్రి, యునానీ దవాఖానా నిర్మాణంలో ఆయన ప్రతిభ బహిర్గతమవుతుంది. నాటి హైదరాబాద్ రాజ్యంలో అనేక నీటి పారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి నిర్మింప చేశారు.తెలంగాణ ప్రాంతంలో గోదావరి, మంజీరా నదులపై పలు సాగునీటి ప్రాజెక్టులు, డ్యామ్‌లు, హైదరాబాద్ చారిత్రక నిర్మాణాలకు ఆయనే డిజైన్ చేశారని చరిత్రకారులు చెపుతారు. ప్రభుత్వాలపై భారం పడకుండా దీర్ఘకాలం రైతులకు, ప్రజలకు ఉపయోగకరంగా తక్కువ ఖర్చు, నాణ్యతతో కూడిన సాగునీటి ప్రాజెక్టులు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ నిర్మించారు.

తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గౌరవార్థం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా 2014, జులై 10న జిఒ నంబరు 18 జారీ చేసి, అలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినాన్ని తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి లక్షల మంది ఇంజినీర్లు తయారవుతున్నారు. ఆయా విభాగాల్లో శిక్షణ ఇవ్వడానికి పలు యూనివర్శిటీలు సేవలు అందిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు వైద్యుడు, ఇంజినీరు కావాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇంతటి ప్రాచుర్యం కలిగిన ఈ విద్య కోసం పోటీ పడి చదువుతున్నారు. ఇంజినీరింగ్ సీట్ల కోసం విద్యార్థులు అహోరాత్రులు కష్టపడుతున్నారు. ఇంజినీరింగ్ విద్య పూర్తికాక ముందే నేడు స్వదేశీ, విదేశీ కంపెనీల క్యాంపస్ ఎంపికల పేరుతో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. వేల నుంచి లక్షల రూపాయల వరకు వేతనాల చెల్లిస్తున్నారు. ఎంతో ఆదరణ చూరగొన్న సివిల్ ఇంజినీరింగ్ ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు సెక్టార్‌లో ప్రతిభతో కూడిన కొలమానంగా మారింది. ప్రభుత్వ ఆధీనంలో అభివృద్ధిలో భాగంగా వేసిన రోడ్లు, కట్టిన భవనాలు, నిర్మించిన చెరువులు, ప్రాజెక్టులు, వేసిన పైపులైన్లు నాణ్యతకు, అభివృద్ధికి కొలమానంగా నిలుస్తున్నాయి.

ఇంజినీరింగ్ రంగం లో రాణించి, తెలంగాణ ఆర్థర్ కాటన్‌గా, తెలంగాణ నీటిపారుదల పితామహుడిగా పేరెన్నిక గన్న నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ పుట్టిన రోజున జరుపుకునే తెలంగాణ ఇంజినీర్స్ డే సందర్భంగా సృజనాత్మకమైన వృత్తి నైపుణ్యాలతో పరిమితమైన వనరుల తోనే నాణ్యమైన పనులు నిర్వహించి మోక్ష గుండం విశ్వేశ్వరయ్య, సర్ ఆర్థర్ కాటన్, నవాజ్ జంగ్ బహదూర్ వలే ప్రజల మదిలో చిరకాలం నిలిచిపోయేందుకు ప్రతీ ఇంజినీర్ కృషి చేయాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.

రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News