Friday, November 22, 2024

కదం తొక్కిన సోషల్ మీడియా

- Advertisement -
- Advertisement -

గతంలో ఎన్నికలు అంటే ప్రచార సభలు, పాదయాత్రలు, సమావేశాలు ఏర్పాటు చేసేవారు. ఇంటింటికీ తిరిగే కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటును అభ్యర్థించేవారు. మారుతున్న కాలానుగుణంగా ఇది వరకు లాగా రోడ్లమీద ఊర్లలో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ ప్రచారం చేసి, ఓటర్లకు దగ్గర కావడానికి ప్రధాన మార్గాలుగా సామాజిక మాధ్యమాలను ఎంచుకున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు కురిపించడానికి, సొంత డబ్బా కొట్టుకోవడానికి ప్రత్యర్థులు చేసే ఆరోపణలు తిప్పి కొట్టడానికి అభ్యర్థులు సోషల్ మీడియాను వాడుతున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్, స్కైపు లాంటి అనేక యాప్‌లను డౌన్‌లోడ్ చేసి వాటిని వినియోగిస్తున్నారు. తమ తరపున పని చేయడానికి సోషల్ మీడియాను క్యాంపెనర్లుగా వినియోగిస్తున్నారు. పార్టీలపరంగా వార్ రూమ్ లను ఏర్పాటు చేసి, అన్ని మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు.

ఎన్నికల్లో ఎట్లైనా గెలవాలన్న లక్ష్యంతో తమ ప్రత్యర్థులపై నేతలు నిరాధార ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా చెప్పడానికి వీలుంటుంది. అదే విధంగా ఎన్నికల్లో ఎట్లా అయినా గెలవాలి అన్న లక్ష్యం తో ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేయడం, ఫేక్ పత్రాలు సృష్టించడం వంటి వాటిని వివిధ గ్రూపులకు పంపుతున్నారు. సోషల్ మీడియా ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రచారంలో కీలకంగా మారింది. అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థాయికి ఎదిగింది. సమాచారం సెకన్లలో లక్షలాది మందిని చేరుతుండడంతో ఇప్పుడు పార్టీలన్నీ సామాజిక మాధ్యమాల వైపు చూస్తున్నాయి. ముఖ్యంగా ఆశావహులు ప్రత్యేకంగా వారి ప్రచారానికి సంబంధించి సోషల్ మీడియా డెస్క్‌లు ఏర్పాటు చేసుకొని రోజువారీ ప్రచార వివరాలు, ప్రజలతో మమేకమయ్యే సందర్భాలను సోషల్ మీడియాలో అప్‌డేట్ చేయడానికి అవగాహన వున్న వారిని ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నారు. అభ్యర్థికి పాజిటివ్ అంశాలను జత చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను రూపొందించి షేర్ చేయడానికి వీడియో ఎడిటర్లు, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు, కంటెంట్ రైటర్లను నియమించుకుంటున్నారు.

డిజిటల్ మీడి యా అనేది ఎలక్ట్రానిక్ డిజిటల్ మెషీన్లు లేదా పరికరాల ద్వారా ప్రాసెస్ చేయగల, విశ్లేషించబడిన, నిల్వ చేయగల, పంపిణీ చేయగల ఏ రకమైన మీడియా అయినా డిజిటల్ మీడియా అంటారు. డిజిటల్ మీడియా అనేది ఎలక్ట్రానిక్ మీడియా, మొబైల్ ఫోన్‌లు, కంప్యూటర్‌లు, పాడ్ క్యాస్ట్‌లు, అప్లికేషన్‌లు మొదలైన డిజిటల్ ప్లాట్ ఫారమ్‌ల ద్వారా అందించబడే కంటెంట్ ప్రమోషన్‌లను కవర్ చేసే ఒక రకమైన మీడియా. కంపెనీలు, వ్యక్తులు, సమాచార మూలం, వినోదం, ఆటలు, వ్యాపారం మొదలైన వివిధ ప్రయోజనాల కోసం డిజిటల్ మీడియాను ఉపయోగిస్తున్నారు.

ఇది వ్యాపార దృక్కోణం నుండి చాలా ఉపయోగకరమైన ప్లాట్ ఫారమ్‌లను అందిస్తున్నది. మెజారిటీ కస్టమర్లు ఇప్పుడు డిజిటల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కొన్ని పరిశ్రమ రంగాలలో ఈ సంఖ్య వ్యాపార దృక్కోణం నుండి చాలా ఎక్కువగా ఉంటుంది. డిజిటల్ మీడియాను అర్థం చేసుకోవడం, ఉపయోగించడం చాలా ముఖ్యమైనది. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా సోషల్ మీడియా కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. ప్రతి పార్టీ వారి అభ్యర్థి సోషల్ టీం లను ఏర్పాటు చేసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్రచారం లో యాక్టివ్‌గా ఉండడానికి పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేయాడానికి క్రియేటివ్ కంటెంట్‌తో ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఒక పార్టీ అభ్యర్థి తన ప్రచారంలో భాగంగా ఒక గ్రామంలో వెళ్లి మాట్లాడితే, కేవలం ఆ గ్రామ ప్రజలే కాకుండా యూట్యూబ్, ఫేస్‌బుక్‌ల లైవ్ స్ట్రీమింగ్ ద్వారా డిజిటల్ ప్రచారం సాగిస్తున్నారు.

అధికార పార్టీ అభ్యర్థులు తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ డాక్యుమెంటరీ రూపంలో ప్రజలకు చేరవేయడానికి ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్ష పార్టీల నేతలు తమ పార్టీ మేనిఫెస్టోను, తాము గెలిస్తే ఏం చేస్తామో సోషల్ మీడియా వేదిక ద్వారా పబ్లిసిటి చేస్తున్నారు. ప్రత్యర్థులు ఏమైనా మాటలను తప్పుగా మాట్లాడినప్పుడు, చేయరాని హావభావాలు వ్యక్తపరచినపుడు నిమిషాల్లో ఆ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ తిప్పుతున్నారు. దీంతో గతంలో మాదిరిగా కాకుండా అభ్యర్థులు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరాన్ని సోషల్ మీడియా తీసుకు వచ్చింది.పెరుగుతున్న సాంకేతికత, యంత్రాలపై ఆధారపడడం వలన యంత్రాలతో మన పరస్పర చర్య పెరుగుతోంది. అందువల్ల ప్రతి ఒక్కరి జీవితంలో డిజిటల్ మీడియా పాత్ర కూడా పెరుగుతోంది. ప్రతి నిమిషానికి డిజిటల్ సోర్సెస్‌లో కొత్తదనం జోడిస్తున్నది. ఈ సమాచారాన్ని అన్వేషించే యూజర్ బేస్ కూడా పెరుగుతోంది. గత దశాబ్దంలో రాబోయే రేడియో స్టేషన్‌లు, ఇ రిటైల్ వెబ్‌సైట్‌లు, లాజిస్టిక్ కంపెనీలు, సెర్చ్ ఇంజన్లు మొదలైన డిజిటల్ ప్లాట్ ఫారమ్‌ల ఆధారంగా వ్యాపారాలు గణనీయంగా పెరిగాయి.

డిజిటల్ ప్లాట్ ఫారమ్‌లలో మార్కెటింగ్ వినియోగం పెరుగుతోంది. అనేక సామాజిక మాధ్యమాల వేదికగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అందరూ ఎంఎల్‌ఎ టికెట్ పొందిన వారు సోషల్ మీడియాలో తమకు టికెట్ ఇచ్చిన పార్టీలకు మద్దతు ఇవ్వాలని పోస్టులు వైరల్ చేసుకుంటున్నారు. అభ్యర్థులు తమకు మద్దతుగా ప్రచారం చేయాలని అత్యధికంగా ఫాలోవర్స్ వున్న పేజీ నిర్వాహకులను సంప్రదిస్తున్నారు. లక్ష సబ్‌స్క్రైబర్స్ వున్న యూట్యూబ్ పేజీకి ఓ ధర, ఆపై వున్న పేజీలకు ఓ ధరను నిర్ణయిస్తూ వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఇప్పటికే వార్త కంటెంట్‌తో ఉన్న యూ ట్యూబ్ పేజీలకు మరింత డిమాండ్ పెరిగింది. అభ్యర్థి ప్రచారం నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు కంటెంట్ సృష్టించి వీడియోలు ప్రసారం చేసి అభ్యర్థికి ఆదరణ వచ్చేలా యాక్టివిటీ అంతా సోషల్ మీడియా నిర్వాహకులే చూసుకుంటారు.

మొత్తంగా ఎన్నికల ప్రచారం సోషల్ మీడియాలో కౌంటర్ ఎటాక్‌లతో జోరందుకోనుంది. చాలా మంది టీనేజర్లు రోజూ (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, వైన్, స్నాప్‌చాట్, వీడియో గేమ్‌లతో సహా) ఏదో ఒక రకమైన ఆన్‌లైన్ మీడియాలో నిమగ్నమైపోతున్నారు. టీమ్ సోషల్ మీడియా వ్యసనం వల్ల అధిక మీడియా వినియోగం మొదలైంది. పెరుగుతున్న మంచి అనుభూతినిచ్చే మార్గంగా సోషల్ మీడియాపై అందరూ ఆధారపడటం వల్ల వేగంగా దుష్ప్రభావం మొదలైంది. చెడు పరిణామాలకు తవివ్వకుండా మంచి వాటికే సోషల్ మీడియాను, డిజిటల్ మీడియాను వాడాలని ఆశిద్దాం.

మోటె చిరంజీవి
9949194327

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News