Friday, November 22, 2024

ఇజ్రాయెల్ దళాల విధ్వంస కాండ.. తరలిపోతున్న వేలాది మంది

- Advertisement -
- Advertisement -

డెయిర్ ఆల్‌బలా ( గాజా స్ట్రిప్ ): ఇజ్రాయెల్ దళాలు బుధవారం గాజా అంతటా హమాస్ ఉగ్రవాదులతో పోరాటాన్ని మరీ తీవ్రం చేశాయి. రెండో పెద్ద నగరం ఖాన్ యూనిస్‌నే లక్ష్యంగా చేసుకుని దాడులు భీకరంగా సాగించడం ప్రారంభించాయి. ఎక్కడైతే పాలస్తీనియన్లు భద్రత కోరుకుంటున్నారో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తున్నాయి. దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ సైన్యాలు మరింత చొచ్చుకుని వస్తున్నాయి. ఖాన్ యూనిస్ నగరం పరిసరాల్లో ప్రజలను వేరే చోటికి తరలిపోవాలని ఆదేశిస్తున్నాయి. అయితే ఎంతమంది ఇజ్రాయెల్ ఆదేశాలను పాటించారో స్పష్టంగా తెలియడం లేదు. గాజాలో ఎక్కడా తమకు భద్రత కనిపించడం లేదని పాలస్తీనియన్లు చాలామంది వాపోతున్నారు.

తమ ఇళ్లను ఇప్పుడు విడిచిపెడితే తిరిగి తమను రానిస్తారో లేదో తెలియడం లేదని బాధపడుతున్నారు. దక్షిణ గాజాలో భారీగా జనం తరలిపోయేలా దాడులు భీభత్సంగా సాగుతున్నాయి. గాజా కోస్తాలో దాదాపు 1.87 మిలియన్ మంది ఉంటున్నట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేయగా, వారిలో 80 శాతం మంది ఇప్పటికీ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఉత్తర ప్రాంతంలో గాజా సిటీ లోని భారీ ప్రాంతాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. గాజా మిగతా ప్రాంతం కూడా ధ్వంసమౌతుందని పాలస్తీనియన్లు భయపడుతున్నారు. గాజాలో దాదాపు 16 ఏళ్లుగా పాలన సాగిస్తున్న హమాస్ వర్గాలను పూర్తిగా నిర్మూలించాలన్న లక్షంతో ఇజ్రాయెల్ ముందుకు సాగుతోంది.

ఖాన్ యూనిస్ నగరం భీకరంగా పోరు సాగుతోందని ఇజ్రాయెల్ మిలిటరీ మంగళవారం వెల్లడించింది. ఇజ్రాయెల్ దళాలు రోడ్లు దిగ్బంధించడంతో గత మూడు రోజులుగా రఫా ప్రాంతం లోనే పరిమితంగా పిండి, నీళ్లు సరఫరా చేస్తున్నారు. మిగతా అవసరాలేవీ అందడం లేదు. ఇంధనం, ఔషధాలు అందడం కష్టంగా ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన సహాయ కార్యక్రమాల కార్యాలయం వెల్లడించింది. ఖాన్ యూనిస్ ఉత్తరాన డెయిర్ అల్ బలా పట్టణం లోని ఆల్ అక్సా మార్టైర్స్ ఆస్పత్రి వద్ద వైద్య సేవలు, ఇతర సహాయ కార్యక్రమాలు అందడం లేదు.

యుద్ధం నిలుపుదల గడువు ముగిసిన తరువాత ఈనెల 1 నుంచి రోజూ 200 మంది క్షతగాత్రులు ఆస్పత్రికి వస్తున్నారు. అయితే వారికి చికిత్స చేసే పరిస్థితి కనిపించడం లేదని గాజా లోని ఎయిడ్ గ్రూప్స్ ఎమర్జెన్సీ కో ఆర్డినేటర్ మేరీ ఆరె పెరియట్ రివైవల్ వెల్లడించారు. విద్యుత్ లేదు.వెంటిలేటర్లు పనిచేయడం లేదు. రక్తదానం సాగడం లేదు. శస్త్రచికిత్స పరికరాలు స్టెరిలైజేషన్ కావడం లేదని ఆమె తెలిపారు. బలవంతంగా ఆస్పత్రులను మూసివేస్తున్నారు. వేలాది మంది రఫాకు తరలిపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News