Sunday, November 24, 2024

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

- Advertisement -
- Advertisement -

ప్రమాణస్వీకారానికి ప్రజలకు రేవంత్ ఆహ్వానం !

హైదరాబాద్ : ఎల్బీస్టేడియంలో గురువారం జరగబోయే తన ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ప్రజలందరూ హాజరు కావాలని రేవంత్‌రెడ్డి బహిరంగ ఆహ్వానం పంపారు. ప్రజా ప్రభుత్వ స్వీకారానికి ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యస్థాపనకు సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ‘తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, శ్రీమతి సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్యస్థాపనకు సమయం ఆసన్నమైంది.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7న మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఈ మహోత్సవానికి అందరూ రావాలి‘ అంటూ బహిరంగ ఆహ్వాన పత్రం విడుదల చేశారు. గురువారం జరగబోయే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, ఎఐసిసి ముఖ్య నేతలకు గాంధీభవన్ ఆహ్వానాలు పంపింది.

అలాగే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, కొత్తగా ఎన్నికైన 119 మంది ఎంఎల్‌ఎలకు సైతం ఇన్విటేషన్లు పంపింది. మాజీ ఎంపిలు, మాజీ ఎంఎల్‌ఎలకు, కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులకు ఆహ్వానాలు పంపారు. గురువార సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో పోలీసులు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్లు తెలిపారు. పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలు నాంపల్లివైపు, ఎస్బీఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు, బషీర్‌బాగ్ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్ కోఠి వైపు, సుజాత స్కూల్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లింపు ఉంటుందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News