ముందున్న ముళ్లకంచెలు, బారికేడ్లు తొలగింపు
వాహనాల రాకపోకలు మరింత సులువు
వాహన చోదకుల హర్షాతిరేకాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రగతిభవన్ ముందు ఏర్పాటు చేయించిన రక్షణ వలయాన్ని అధికారులు తొలగించారు. ఇప్పటికే ముళ్లకం చెలు, బారీకేడ్లను తొలగించిన జిహెచ్‌ఎంసి సిబ్బంది శాశ్వతంగా ఏర్పాటుచేసిన గ్రిల్స్ కూడా తొలగిస్తున్నారు. గేట్లను తొలగించడంతో లోపలి నుండి వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. జేసిబిలు, ట్రాక్టర్లతో ఈ ప్రగతిభవన్ ముందున్న గ్రిల్స్ తొలగిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రె స్ అధికారం లోకి రాగానే రాష్ట్ర సచివాలయం, ప్రగతిభవన్‌లోకి సామాన్యులు అనుమతి వుంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రగతి భవన్ పేరును అంబేద్కర్ ప్రజా భవన్‌గా మారుస్తామని ఎప్పుడయినా ప్రజల తమ సమస్యలు తెలియజేసేందుకు ఇక్కడికి రావచ్చన్నారు. ఇందుకోసం ప్రగతి భవన్ ముందున్న గేట్లను తొలగిస్తామని రేవంత్ రెడ్డి ముందుగానే ప్రకటించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పూర్తిగా గ్రిల్స్ తొలగించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని ట్రాఫిక్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రగతి భవన్ వద్ద ముళ్లకంచెలు, బారికేడ్లు తొలగించి వాహనాల రాకపోకలను సుగమం చేయడంపై వాహన చోదకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సచివాలయంలోనే మీడియా పాయింట్?
మరోవైపు సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియా పాయింట్ ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు సచివాలయం బయట ఉన్న మీడియా పాయింట్‌ను సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌కు తరలించాలని ఇటీవలే ఈ మేరకు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.