Saturday, December 21, 2024

తుపాన్ వెళ్లినా వీడని దుస్థితి

- Advertisement -
- Advertisement -

చెన్నై : మహానగరం చెన్నైలో తుపాన్ భారీ వర్షాల అనంతర వరద ప్రభావం మరింత తీవ్రస్థాయికి చేరింది. గురువారం కూడా చెన్నై పలు వీధులలో , ప్రధాన కూడళ్లలో వరద నీరు వచ్చి చేరింది. పలు నివాసాలు నీట మునిగి , దాదాపు ఐదారు రోజులుగా జనం నానా యాతనలకు గురవుతున్నారు. భారీ కుండపోత వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే చెన్నై శివారు ప్రాంతాలలో జలదిగ్బంధ పరిస్థితి వీడకుండా సాగుతోంది. సైక్లోన్ మిగ్‌జాంతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్లు వంటి చోట్ల వరదలు ప్రజలకు నరకం చూపాయి. మంగళవారం తుపాన్ ఆంధ్రప్రదేశ్ తీరం దాటింది. అంతకు ముందు ఆ తరువాత చెన్నైలో కుండపోత వర్షాలు పడ్డాయి. చెన్నై దాదాపుగా మరో సముద్రాన్ని తలపించింది. ఇది నిజానికి ఈ నగరానికి ఇక ముందు తలెత్తే పెను జల ప్రమాదాన్ని సూచిస్తోందని నిపుణులు తెలిపారు. స్టాలిన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ , సహాయక చర్యలను వేగవంతం చేసింది.

నిలవ ఉండిన నీటిని బయటకు పంపించే యత్నాలు జోరందుకున్నాయి. పలు ప్రాంతాలలో ఆహార ధాన్యాల ప్యాకెట్లు, మంచి నీటి ప్యాకెట్లు అందిస్తున్నారు. చెన్నైలోని మనాలీలో వరద పరిస్థితి గుండెకోతనే మిగిల్చింది. ఇక్కడ పెద్ద ఎత్తున మంచినీరు, 12000 లీటర్ల మేర పాలు, పాల పొడి, దుప్పట్లు అందించే ఏర్పాట్లు జరిగాయి. ఇక్కడి నుంచి దాదాపు 15వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిఎం స్టాలిన్ గురువారం అంకాపుతూరు ప్రాంతంలో పర్యటించారు. సహాయక చర్యలను సమీక్షించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎటువంటి సహాయక చర్యలు చేపట్టకుండా , కేవలం అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపడంతోనే సరిపెడుతోందని ప్రతిపక్ష అన్నాడిఎంకు విమర్శించింది. నగరంలోని అత్యంత ప్రధానమైన 35000 వరకూ అంతర్గత రోడ్లలో దాదాపు 20,000 రోడ్లు జల దిగ్బంధంలో ఉన్నాయని పార్టీ ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీలో విపక్ష నేత ఎడప్పాడి కె పళనిస్వామ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News