న్యూఢిల్లీ: ఈ నెల మూడవ వారంలో జగరనున్న ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశంలో సీట్ల పంపకం ఒప్పందాలే ప్రధాన చర్చనీయాంశం కానున్నట్లు గురువారం వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 17, 20 తేదీల మధ్య ఇండియా కూటమి తదుపరి సమావేశం జరగనున్నట్లు వారు చెప్పారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేసి అందుకు తగ్గట్లు ప్రచారం నిర్వహించడానికి తగిన సమయం ఉంటుంది కాబట్టి వివిధ రాష్ట్రాలలో సాధ్యమైనంత త్వరగా సీట్ల సర్దుబాట్లపై ఒప్పందాలు చేసుకోవాలని ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతోందని వర్గాలు తెలిపాయి.
బుధవారం రాత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు వారు చెప్పారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం ఉదయం జరిగిన ప్రతిపక్ష నాయకుల సమావేశంలో కూడా సీట్ల పంపకం అంశాన్ని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ప్రస్తావిచారు. ఇండియా కూటమి చివరిసారి ఆగస్టు 31, సెప్టెంబర్ 1న సమావేశమైంది.