Tuesday, November 26, 2024

పౌరుల హక్కుల పత్రం

- Advertisement -
- Advertisement -

భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్న అఖండ భారతావని పరిపాలన ప్రజాహిత గ్రంథం భారత రాజ్యాంగం. ఇది చారిత్రకంగా మానవ నిర్మిత అడ్డుగోడలై కుల, మత, భాష, ప్రాంతం భేదాలను కూకటివేళ్లతో పెకలించినది. స్వేచ్ఛా, సమానత్వం, సోదర భావం అనే గొప్ప విలువలను ప్రసాదించిన భారత దేశపు అత్యున్నత చట్టం భారత రాజ్యాంగం. ఈ పరిపాలన గ్రంథ రూపశిల్పి, ప్రపంచ మేధావిగా పిలవబడుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈయన 1946లో భారత రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షునిగా వ్యవహరించారు. దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి అట్టడుగు వర్గాల ప్రజల ఆత్మఘోషకు విముక్తి కల్పిస్తూ, ఓటు హక్కు అనే ఆయుధం ద్వారా పౌరులందరికీ రాజకీయ భాగస్వామ్యాన్ని కల్పించారు. పటిష్టమైన వ్యవస్థల సమాహారంతో అక్షర రూపం దాల్చిన ‘భారత రాజ్యాంగం’ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాల పరిమితితో పూర్తి చేసిన అతిపెద్ద గ్రంథం. తద్వారా సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగా ప్రకటించుకొని 1950 జనవరి 26న అమల్లోకి తేవడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ప్రతి ఏటా నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో ఈ రోజు రాజ్యాంగం గురించి తెలిసిన అనుభవజ్ఞులచే ఉపన్యాసాలు, వ్యాసరచన తదితర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షత వహించిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చేసిన నిర్విరామ ప్రయత్నాల వల్లే భారత రాజ్యాంగం మనకు వరప్రసాదమైంది. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మన రాజ్యాంగం సంపూర్ణ ఆమోదం పొందింది. అందువల్లనే ఏడు దశాబ్దాల తర్వాత కూడా అది ఒక పవిత్రమైన పత్రంలా నిలిచి ఉంది. ప్రత్యేకించి రాజ్యాంగాల జీవితకాలం తరచుగా తక్కువగా ఉంటున్న, కొత్తగా విముక్తి పొంది అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో భారత రాజ్యాంగం సాధించిన విజయం సామాన్యమైంది కాదు. భారత రాజ్యాంగం ఎల్లప్పుడూ పౌరులందరి ఆత్మగౌరవం, సంక్షేమం కోసం నిలబడింది.

దేశంలో రాజ్యాంగ ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంలో ప్రభుత్వ అంగాలన్నీ దశాబ్దాలుగా దోహదం చేస్తున్నాయి. దీని కారణంగానే మన దేశం ఆకలి, నిరక్షరాస్యత, దారిద్య్రం, వెనుకబాటుతనం వంటి వాటిని నిర్మూలించి, సమగ్ర అభివృద్ధి, జవాబుదారీతనం, పారదర్శకత వైపు ప్రయాణం సాగిస్తున్నాము. అయినప్పటికీ 75 వసంతాల స్వతంత్ర భారత దేశంలో నేటికీ ప్రపంచ ఆకలి సూచీలో 111వ స్థానం, మానవ అభివృద్ధి సూచీలో 132వ స్థానంలో నిలవడం శోచనీయం. ఈ సమయంలో మన అభివృద్ధి వ్యూహాలు ఎటువైపు వెళుతున్నాయని ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. రాజ్యాంగాన్ని ఎంత చక్కగా, వివరంగా రాసుకున్నప్పటికీ… సంస్థలు, ప్రజలతో అది సంకేతాత్మక బంధాన్ని నెలకొల్పుకోవడంలో విఫలమైతే అలాంటి రాజ్యాంగానికి అర్థమే లేదని మన రాజ్యాంగ నిర్మాతలు చక్కగా గుర్తించారు. ఈ క్రమంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని, రాజకీయ సుస్థిరతను దేశం సాధించగలుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్వావలంబనను, సమానతను, దేశ పౌరులందరికీ నాణ్యమైన జీవితాన్ని అందిస్తూ, ఆధునిక సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దడానికి భారత రాజ్యాంగమే దోహదం చేస్తుంది.

రాజ్యాంగం అంటే ప్రకరణాలు, నిబంధనల సమాహారం మాత్రమే కాదు. భారత రాజ్యాంగపు జాతి ప్రాథమిక విలువలకు, నవీన నాగరికతకు నాంది పలికే ఒక సజీవ పత్రం. అదే సమయంలో వేగంగా మారిపోతున్న ప్రపంచంలో ప్రజా అవసరాలు, డిమాండ్లకు ప్రతిస్పందించేలా ఎప్పటికప్పుడు మార్చుకోగల సరళమైన నిర్మాణాన్ని కూడా ఇది బల పరుస్తుంది. ఈ సరళత వల్లే పార్లమెంటు ఎప్పటికప్పుడు ప్రజా అవసరాల దృష్ట్యా రాజ్యాంగ సవరణలను చేయగలుగుతోంది. భావి సమాజానికి భవిష్యత్తును చూపే భారత రాజ్యాంగం గురించి బాల్య దశ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిక ఇటీవల కర్నాటక ప్రభుత్వం విద్యాసంస్ధల్లో రాజ్యాంగ పీఠిక పఠనాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో విద్యార్ధులు తమ బాధ్యతలను తెలుసుకుని మెలిగే అవకాశం ఉందని, ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో రాజ్యాంగ పఠనం తప్పనిసరి చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రజల పక్షాన నిలబడే ఈ గ్రంథాన్ని దేశంలో ప్రతి పౌరుడికీ భారత ప్రభుత్వం అందించి దీనిపై అవగాహన కలిగించాలి.

భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మన రాజ్యాంగం సంపూర్ణ ఆమోదం పొందింది. పౌరులకు హక్కులను కల్పించి, బాధ్యతలను తెలియడం వల్లనే ఇది సాధ్యమైంది. అందువల్లనే ఏడు దశాబ్దాల తర్వాత కూడా అది ఒక పవిత్రమైన అధికారిక పత్రంగా మన ముందు నిలిచి ఉంది. అందుకే తరం తర్వాత తరంలో రాజ్యాంగానికి ఆమోదనీయత పెరుగుతూనే వస్తోంది. ప్రపంచ దేశాల రాజ్యాంగాలతో పోలిస్తే మన దేశ రాజ్యాంగం విశ్వసనీయత మరింత పెరుగుతుంది. అలాగే భారత రాజ్యాంగంతో మమేకమైన దేశ పౌరులను కూడా మనం అభినందించాల్సిన సమయమిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News