ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మహమూద్ కన్నుమూశారు. ఆయన వయసు 67 ఏళ్లు. కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న మహమూద్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. బాలనటుడిగా హిందీ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అప్పటికే కమేడియన్ గా స్ధిరపడిన మహమూద్ ను అనుకరిస్తూ నటించేవారు. మహమూద్ తో కలసి ఆయన 1968లో సుహాగ్ రాత్ సినిమాలో నటించారు. అప్పటినుంచీ మహమూద్ స్వయంగా ఆయనను జూనియర్ మహమూద్ అని పిలవడం మొదలుపెట్టాడు. అప్పటినుంచీ అందరూ ఆయనని అలానే పిలవసాగారు. తన అసలు పేరు నయీమ్ సయ్యద్. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
1966లో వచ్చిన మొహబ్బత్ జిందగీ హై సినిమాతో అరంగేట్రం చేసిన జూనియర్ మహమూద్, దాదాపు 260 చిత్రాలలో నటించారు. బ్రహ్మచారి సినిమాలో షమ్మీకపూర్ తోను, కారవాన్ లో జితేంద్రతోనూ, హాథీ మేరే సాథీలో రాజేశ్ ఖన్నాతోను జూనియర్ మహమూద్ పండించిన కామెడీని ఎవరూ మరచిపోలేరు. కటీపతంగ్, హరే రామ హరే కృష్ణ, గీత్ గాతా చల్, ఈమాన్ దార్, బాప్ నంబరీ బేటా దస్ నంబరీ, ఆజ్ కా అర్జున్, గురుదేవ్, ఛోటే సర్కార్, జుదాయి వంటి సినిమాలు జూనియర్ మహమూద్ కు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.
ప్యార్ కా దర్ద్ హై, మీఠా మీఠా ప్యారా ప్యారా, ఏక్ రిష్తే సఝేదారీ కా వంటి టీవీ సీరియళ్లలోనూ జూనయర్ మహమూద్ నటించారు. చివరి రోజుల్లో ఒకప్పటి హీరో జితేంద్రను చూడాలని ఉందని చెప్పడంతో జితేంద్ర స్వయంగా మహమూద్ ఇంటికి వచ్చి, కాసేపు అతనితో గడిపి వెళ్లారు.