సోనియా గాంధీ పుట్టిన రోజు తెలంగాణ ప్రజలకు ఒక పండుగ రోజు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఆయన చెప్పారు. శనివారం సోనియా గాంధీ 78వ పుట్టినరోజు సందర్భంగా నాంపల్లిలోని గాంధీ భవన్లో ఆమె బర్త్డే సెలబ్రషన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 9, 2009లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఉక్కు సంకల్పంతో సోనియమ్మ మన ఆకాంక్షలు నెరవేర్చారని అన్నారు. 60ఏళ్ల తెలంగాణ ప్రజల కలలను సోనియా గాంధీ నెరవేర్చారన్నారు. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో మనం చూడలేదని.. తెలంగాణ తల్లి సోనియమ్మ రూపంలో ఉంటుందని ఆ తల్లి మనకు భరోసా ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు కృతజ్ఞత భావంతో ఉంటారని మొన్నటి ఎన్నికల తీర్పుతో నిరూపించారని చెప్పారు. ఈ విజయం కార్యకర్తలదని.. మీ అందరీ ఆశీస్సులతో మొదటి రోజు శాసనసభకు హాజరవుతున్నామని సీఎం రేవంత్ అన్నారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత వి హనుమంతరావు, రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పలువురు మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 78 కిలోల భారీ కేక్ ను కట్ చేసి సోనియా గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.