Sunday, November 24, 2024

కాంగ్రెస్, మజ్లిస్ మధ్య లోపాయికారి ఒప్పందం

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎంఐఎంతో మచ్చిక: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేశారని, సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ఏ ప్రాతిపదికన నియమించారని నిలదీశారు. శనివారం బిజెపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీని ఆదరించారని, ఒక్క స్థానం నుంచి 8 సీట్లకు పెరిగి 6 నుంచి 14 శాతానికి మా ఓటు బ్యాంకు పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారం శాసనసభ గౌరవాన్ని కాల రాసిందని, మజ్లిస్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ పార్టీ వ్యక్తిని ప్రొటెం స్పీకర్‌గా చేసిందన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ చేయడాన్ని బిజెపి వ్యతిరేకిస్తుంది. అనేక మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా చేయడంపై మండిపడ్డారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయరని చెప్పారు. ఈ అంశంపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని, స్పీకర్ ఎన్నికను ఆపాలని డిమాండ్ చేస్తున్నామని రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే మా ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా దగ్గినా పడిపోతుంది అందుకే మజ్లిస్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News