చెన్నై: మిచౌంగ్ తుపాను కారణంగా తమిళనాడు ప్రజలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. వారిని ఆదుకోవడానికి రాష్ట్రప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తున్నప్పటికీ స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సైతం తమదైన రీతిలో వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ టివిఎస్ ముందుకు వచ్చింది. సహాయచర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.3 కోట్ల విరాళం ప్రకటించింది.
ఈ విషయాన్ని టివిఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘తుపాను కారణంగా తమిళనాడు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాజాన్ని కాపాడుకునేందుకు మా వంతు కృషి చేయాలనుకున్నాం. తీవ్రంగా నష్టపోయిన బాధితుల అవసరాలకు ఈ విరాళం ఉపయోగపడుతుంది’ అని టివిఎస్ మోటార్ కోమేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు ఆ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా పలు జిల్లాల్లో సమస్యల్లో చిక్కుకున్న తమ కస్టమర్లకు అదనంగా వాహన తనిఖీ సర్వీసును కూడా అందించనున్నట్లు సంస్థ తెలిపింది.
సుజుకీ ఉచిత సర్వీస్
మరో వైపు చెన్నైతో పాటుగా తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్ల్లూరు జిల్లాల్లో తమ డీలర్ నెట్‌వర్క్‌లను యాక్టివేట్ చేసి వినియోగదారులకు ఉచిత సమగ్ర చెకప్‌తో సమగ్ర సర్వీస్‌ను అందించనున్నుట్లు జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ భారతీయ అనుబంధ సంస్థ అయిన సుజుకీ మోటార్ సైకిల్ తెలియజేసింది. దీంతో పాటుగా డిసెంబర్ వరకు ఇంజిన్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్,ఫ్యూల్ ఫిల్టర్‌లను ఉచితంగా రీప్లేస్‌మెంట్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.