మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆదివారం సోమాజీగూడ యశోద ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ కూడా వెళ్లారు. ఈ సందర్భంగా సోమాజీగూడ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆస్పత్రికి వెళ్లిన సీఎం రేవంత్.. కేసీఆర్ ను కలిసి పరామర్శించారు. వైద్యుల ద్వారా ఆయన ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న రేవంత్ రెడ్డి.. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో భేటీ అయ్యారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పడు పర్యవేక్షించేందుకు.. సీఎం రేవంత్ రెడ్డి నిన్న(శనివారం) వైద్య, ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీని యశోద ఆస్పత్రికి పంపించారు. కాగా, ఫాంహౌజ్ లో గురువారం అర్థరాత్రి బాత్ రూమ్ లో కేసీఆర్ కాలుజారి పడడంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు యశోద ఆస్పత్రి వైద్యుల బృందం హిప్ ప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.