హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎపి మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సవాల్ విసిరారు. ఎవరి హయాంలో రైతులకు మేలు జరిగిందో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే తనతో చర్చకు రావాలని కాకాణి సవాల్ విసిరారు. తేదీ, సమయం, స్థలం చెబితే తాను వస్తానని, దమ్ముంటే చంద్రబాబు రావాలని కాకాణి సవాల్ విసిరారు. తుపాన్, వరదల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సకాలంలో స్పందించారని ప్రశంసించారు. సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి తగిన ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామని, యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
గత రెండు రోజులుగా చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారని, ఎక్కడా ప్రభుత్వం విఫలమైందని స్పష్టంగా ఎందుకు చెప్పలేకపోతున్నారని అడిగారు. విపత్తుల సమయంలో ప్రజలకు తమ ప్రభుత్వం అండగా నిలిచిందని, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే చంద్రబాబు ఎందుకు కడుపుమంట అని చురకలంటించారు. ఫొటోలకు పోజులు ఇచ్చేంది చంద్రబాబు నైజం కాదా?, సిఎం జగన్ ప్రజలతో మమేకమయ్యే నాయకుడు అని, చంద్రబాబు కూతలు కూస్తుంటే ఈనాడు గ్రూపుల అధినేత రామోజీ రావు రాతలు రాస్తున్నారని మంత్రి కాకాణి దుయ్యబట్టారు. వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు కాదా? అని ఎద్దేవా చేశారు. రైతులను ఏనాడూ చంద్రబాబు పట్టించుకోలేదని కాకాణి విమర్శలు గుప్పించారు. 14 ఏళ్లలో వ్యవసాయానికి చంద్రబాబు తీసుకున్న చర్యలేంటి అని ప్రశ్నించారు.