గూగుల్ మ్యాపును నమ్ముకొని గౌరవెల్లి ప్రాజెక్టులోకి దూరిన డీసీఎం
నేరుగా గౌరవెల్లి ప్రాజెక్టులోకి దూరిన డిసిఎం
మన తెలంగాణ/అక్కన్నపేట: గూగుల్ మ్యాప్ ని నమ్ముకొని నేరుగా ప్రాజెక్టు నీటిలోకి దూసుకెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి 9 గంటల సమయంలో హనుమకొండ నుండి హైదరాబాదుకు వయా రామవరం మీదగా జెసిబి డ్రైవర్ జెసిబితో వెళ్తున్నాడు. దారి తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్ సహాయం తీసుకుని వెళ్తున్నా క్రమంలో నందారం స్టేజి వద్ద కుడివైపుగా చూపించాల్సిన మ్యాప్ ఎడమవైపు చూపించడంతో నేరుగా గౌరవెల్లి ప్రాజెక్టు నీటిలోకి దూసుకెళ్లాడు.
ఇంతకింతకు నీళ్లు పెరగడంతో తప్పుదారికి వెళ్లానని గ్రహించిన జెసిబి డ్రైవర్ అక్కడే ఆగిపోయాడు. లేదంటే నీట మునిగి పెద్ద ప్రమాదమే జరుగుండేదని ఖంగుతిన్నాడు. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు జెసిబి సహాయంతో డీసీఎం ను బయటకి తీశారు. గత నాలుగు నెలల క్రితం కూడా ఓ లారీ డ్రైవర్ గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని ఇదే ప్రాజెక్టులోకి దూరాడు మళ్లీ అచ్చుగుద్దినట్టు ఇలానే జరిగిందంటూ చెప్పుకుంటున్నారు. పెద్ద ఎత్తున ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని శాశ్వత సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రాంత ప్రజలు కోరారు.