న్యూఢిల్లీ : రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేవ చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ హత్య కేసులో ముగ్గురు కీలక నిందితులను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ఢిల్లీ క్రైమ్‌బ్రాంచ్ పోలీస్‌లు, రాజస్థాన్ పోలీస్‌లు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ప్రధాన నిందితులను చండీగఢ్‌లో పట్టుకున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. హత్యతో ప్రమేయమున్న రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీ అనే ఇద్దరు షూటర్లను ఛండీగఢ్‌లో పట్టుకున్నారు. వీరితోపాటు మరోవ్యక్తి ఉద్ధమ్ సింగ్‌ను కూడా అదుపు లోకి తీసుకున్నారు. ముగ్గురినీ ఢిల్లీకి తరలించారు.
డిసెంబర్ 5 న సుఖ్‌దేవ్ సింగ్ నివాసంలో ఆయనపై నితిన్ ఫౌజీ, రోహిత్ రాథోడ్‌లు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరికి సహకరించిన రామ్‌వీర్ సింగ్ ను జైపూర్‌లో అరెస్ట్ చేసిన తరువాత నితిన్, రోహిత్‌ల అరెస్టులు జరిగాయని జైపూర్ పోలీస్ కమిషనర్ అధికారిక ప్రకటనలో తెలిపారు. నిందితుల ఆచూకీ చెప్పిన వారికి రూ. 5 లక్షల రివార్డు పోలీస్‌లు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమం లోనే పరారీలో ఉన్న నిందితులు తమ ఫోన్లు వినియోగిస్తుండడంతో వారున్న లొకేషన్‌ను పోలీస్‌లు గుర్తించారు. అక్కడికి చేరుకుని నిందితులను అరెస్ట్ చేశారు.