Saturday, November 23, 2024

ఛత్తీస్‌గఢ్ సిఎంగా విష్ణుదేవ్ సాయి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో తదుపరి ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ రాష్ట్రంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి , పాలిత కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వచ్చింది. ఆదివారం బిజెపి లెజిస్లేచర్ పార్టీ కీలక సమావేశం జరిగింది. ఇందులో నూతనంగా ఎన్నికైన 54 మంది బిజెపి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లెజిస్లేచర్ పార్టీ నేతగా సాయిని ఎన్నుకున్నారు. బిజెపి తరఫున కేంద్ర పరిశీలకులుగా ఈ సమావేశానికి అర్జున్ ముండా, శర్వానంద సోనోవల్, దుష్కంత్‌గౌతమ్ హాజరయ్యారు. సాయి పేరును నేతగా ప్రకటించారు. దీనికి ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. దీనితో ఆయన రాష్ట్రానికి తదుపరి సిఎం అయ్యేందుకు మార్గం ఏర్పడింది. బిజెపిలో విష్ణుదేవ్ సాయి ఆదివాసీ గిరిజన వర్గానికి చెందిన ప్రధాన నేతగా ఉన్నారు. 90 మంది సభ్యుల అసెంబ్లీలో ఇటీవలి ఎన్నికలలో బిజెపికి 54 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్‌కు 35 సీట్లు వచ్చాయి.

2018 ఎన్నికలలో ఈ పార్టీకి అత్యధికంగా 68 స్థానాలు లభించాయి. ఇప్పుడు రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో బిజెపి అత్యధిక స్థానాలను దక్కించుకుంది. ఎస్‌టిలకు రిజర్వ్ అయి ఉన్న మొత్తం 29 స్థానాలలోనూ బిజెపికి 17 సీట్లు దక్కడంతో గిరిజనులకు ప్రాతినిధ్యం వహిస్తోన్న నేత సాయికే సిఎం పదవి వరించింది. కాగా ఎన్నికల ప్రచార సభలలో కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదేపదే గిరిజన నేత సాయినే సిఎం చేస్తారని ప్రకటించారు. ఇప్పుడు ఇది నిజం అయింది. ఇప్పుడు సిఎం కానున్న సాయి రాష్ట్రంలోని కంకురి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. రాష్ట్రంలోని గిరిజనులు ఎక్కువగా బిజెపిని ఆదరించడంతో , ఇప్పటివరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరాజయం పాలయింది. బిజెపి సుస్పష్ట్ర విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బిజెపి నేతగా విష్ణుదేవ్ ఎన్నిక తరువాత ఎమ్మెల్యేలతో కూడిన బృందం ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లింది. సాయి ఎల్‌పి నేతగా ఎన్నికైన విషయాన్ని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు తెలిపారు. తమను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.

సర్పంచ్ నుంచి సిఎం దాకా సాయి ప్రస్థానం
పలుసార్లు ఎంపిగా, బిజెపి రాష్ట్ర స్థాయి నేతగా
బిజెపి లెజిస్లేచర్ పార్టీ నేత అయిన విష్ణుదేవ్ సాయి అంచెలంచెలుగా రాజకీయాలలో ఎదిగారు. ఆయన రాజకీయ జీవితం గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి ముందుకు సాగింది. పార్టీలో పలు కీలక సంస్థాగత పదవులలో కూడా ఆయన రాణించారు. పలుసార్లు లోక్‌సభ ఎంపి అయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.మోడీ తొలికేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ బిజెపికి ఆయన మూడుసార్లు అధ్యక్షులుగా వ్యవహరించారు. జష్పూర్ జిల్లాకు చెందిన సుర్గూజా ప్రాంతంలోని కుగ్రామం బగియా ఆయన జన్మస్థలం. రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తాత, ఇతర సమీప బంధువులు కూడా నేతలుగా పలుకుబడి సాధించారు. ఈ నేత అసెంబ్లీకి ఎన్నిక కావడం ఇదే తొలిసారి. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీల సంఖ్య ఎక్కువగా ఉంది. మొత్తం జనాభాలో వీరు దాదాపుగా 32 శాతంగా ఉంది. ఒబిసిల తరువాత రాష్ట్రంలో అత్యంత ప్రాబల్యపు సామాజిక వర్గంగా ఉంది. మాజీ సిఎం రమణ్ సింగ్‌కు విష్ణుదేవ్ కుడిభుజంగా ఉంటూ వస్తున్నారు. రా్రష్ట్రంలో బిజెపికి రమణ్ సింగ్ తలమానికం అయ్యారు. దీనితో ఆయన మనిషిని ఇప్పుడు సిఎం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత రమణ్‌సింగ్‌కు బాధ్యతలు చేపడుతారని ప్రచారం జరిగింది. కానీ సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆదివాసీ నేత ఎంపిక జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News