Friday, November 15, 2024

కెసిఆర్ సలహాలు అవసరం

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని సిఎం ఆకాంక్ష

యశోదలోమాజీ సిఎంను పరామర్శించిన అనంతరం సిఎం రేవంత్ వ్యాఖ్యలు

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. బాత్‌రూంలో జారిపడటంతో తుంటి ఎముక విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెసిఆర్‌ను ఆదివారం సిఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో వైద్యులు, కెటిఆర్‌తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కెసిఆర్ చికిత్స పొందుతున్న గదికి వెళ్లి కెసిఆర్‌ను కలిసి ఆయనను కలిసి యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్‌కు మెరుగైన చికిత్స అందించాలని సిఎం వైద్యులకు సూచించారు. సుమారు 20 నిముషాలపాటు ముఖ్యమంత్రి యశోద ఆస్పత్రిలోనే ఉన్నారు.

అనంతరం ఆస్పత్రి ఆవరణలో మీడియాతో సిఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కెసిఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. కెసిఆర్ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని, ఆయన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి అవసరమని వ్యాఖ్యానించారు. కెసిఆర్ కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. కాగా కెసిఆర్‌ను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో సిఎం రేవంత్‌రెడ్డి వెంట మంత్రులు సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. వారి కంటే ముందు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కెసిఆర్‌ను పరామర్శించారు. ఆసుపత్రిలో మాజీ సిఎం కెసిఆర్ దగ్గర కెటిఆర్, హరీశ్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. కాగా, తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కెసిఆర్ కోలుకుంటున్నారు. వైద్యులు వాకర్ సాయంతో శనివారం ఆయనను నడిపించారు.

కెసిఆర్ చాలా వేగంగానే రికవరీ అవుతున్నారు : డాక్టర్ ప్రవీణ్‌రావు
కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నదని యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రవీణ్‌రావు చెప్పారు. ఆయన చాలా వేగంగానే రికవరీ అవుతున్నారని అన్నారు. ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ వైద్యుల పర్యవేక్షనలో వాకర్ సాయంతో నడిపించే ప్రయత్నం చేయగా, ఆయన శరీరం బాగా స్పందించిందని తెలిపారు. బెడ్ బయటకు వచ్చి కూర్చున్నారని వెల్లడించారు. సాధారణంగా తుంటి కీలు మార్పిడి జరిగిన పేషెంట్‌ను 12 గంటల్లోపు నడిపించే ప్రయత్నం చేస్తామని, దీన్ని మెడికల్ పరిభాషలో ‘మొబిలైజేషన్ స్టార్ట్’ అంటారని వివరించారు.

కెసిఆర్‌కు ఆపరేషన్ నొప్పి తగ్గి, సాధారణ నొప్పి మాత్రమే ఉన్నదని, ఆయన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని తెలిపారు. సాధారణ ఆహారమే తీసుకుంటున్నారని పేర్కొన్నారు. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు కూడా చేయిస్తున్నామని చెప్పారు. మరికొన్ని రోజులు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందని అన్నారు. శరీరం సహకరిస్తే మరో రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపారు. కనీసం 6 నుంచి 8 వారాలపాటు విశ్రాంతి అవసరం ఉంటుందని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News