బిఎస్‌పి ఉత్తరాధికారిగా ఆకాశ్ ఆనంద్‌ను ప్రకటించిన అధినేత్రి
లక్నో : బిఎస్‌పి అగ్రనేత్రి మాయావతి తన ఉత్తరాధికారిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను ప్రకటించారు. దీనితో ఆకాశ్ ఉత్తరప్రదేశ్‌లో బిఎస్‌పి లో కీలక పాత్ర పోషించనున్నారు. మాయావతికి రాజకీయ వారసుడు కానున్నారు. అయితే బహుజన సమాజ్ పార్టీ అధికారికంగా ఈ నిర్ణ యం తెలియచేయలేదు. కానీ మాయావతిజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కార్యవర్గ సభ్యులు ఉదయ్‌వీర్ సింగ్ ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో బిఎస్‌పి ఎన్నికల రాజకీయాలలో పలు పరాజయాలు పొందుతూ వచ్చింది. కానీ ఈ పార్టీకి సామాజికంగా రాజకీయంగా తగువిధమైన ప్రాబల్యం ఉంది. బిఎస్‌పిని పటిష్టం చేసే బాధ్యతను ఆకాశ్‌కు తమ నాయకురాలు అప్పగించినట్లు సింగ్ వెల్లడించారు. ఇటీవల జరిగిన బిఎస్‌పి అఖిల భారత స్థాయి సమావేశంలో ఆనంద్‌కు ఈ బా ధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపారని వివరించారు. ఇక మాయావతి తరవాత ఆమె రాజకీయ బాధ్యతలు తీసుకునేది ఆయనే అని స్పష్టం చేశారు. బిఎస్‌పి ఎమ్మెల్సీ భీమ్‌రావు అంబేద్కర్ కూడా ఈ విషయాన్ని నిర్థారించారు. పార్టీ అధికారికంగా ఇప్పటికీ ఆకాశ్ ఆనంద్ పేరును వెల్లడించలేదు. త్వరలోనే ఈ ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.