Sunday, January 19, 2025

బహిష్కరణపై సుప్రీంకోర్టులో మహువా మొయిత్ర పిటిషన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రశ్నకు నగదు ఆరోపణలపై గత వారం లోక్‌సభ నుంచి తనను బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రశ్నలు వేయడానికి వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి రూ. 2 కోట్ల నగదుతోపాటు అత్యంత ఖరీదైన బహుమతులను ముడుపులుగా పుచ్చుకున్నారన్న ఆరోపణలపై టిఎంసి ఎంపి 49 సంవత్సరాల మహువా మొయిత్రా పార్లమెంట్ సభ్యత్వంపై అధికారిక పార్లమెంటరీ వెబ్‌సైట్‌కు చెందిన తన వ్యక్తిగత అకౌంట్ పాస్‌వర్డ్‌ను ఆ వ్యాపారికి అందచేయడమేగాక ఆయన నేరుగా ప్రశ్నలను పోస్టు చేసే వెసులుబాటును కల్పించినట్లు మహువాపై ఆరోపణలు వచ్చాయి. తాను ముడుపులు పుచ్చకున్నానన్న ఆరోపణలను ఆమె ఖండించినప్పటికీ లాగ్ ఇన్ వివరాలను మాత్రం ఆ వ్యాపారికి అందచేసింది నిజమేనని ఆమె అంగీకరించారు.

అయితే ఇలా పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకోవడం ఎంపీలకు సర్వసాధారణమేనని ఆమె వాదించారు. మహువా మొయిత్రా అవినీతికి పాల్పడినట్లు స్పష్టంగా రుజువైందని, బహుమతులు తీసుకుని ఒక వ్యాపారికి తన లాగ్ అందచేయడం క్విడ్ పో కో కిందకు వస్తుందని ఆమెపై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేసిన పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఒక ఎంపి ఈ విధంగా అవినీతికి పాల్పడడం అనైతిక ప్రవర్తనగా కమిటీ తన నివేదికలో పేర్కొంది. గత వారం లోక్‌సభలో ఎథిక్స్ కమిటీ ప్రవేశపెట్టిన 500 పేజీల నివేదిక అధికారి, ప్రతిపక్షం మధ్య తీవ్ర దుమారానికి దారితీసింది. మహువా మొయిత్రా పార్లమెంట్‌లో మాట్లాడేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించలేదు. వాడివేడి చర్చ అనంతరం ఓం బిర్లా మూజువాణి ఓటుతో ఎథిక్స్ కమిటీ నివేదికను ఆమోదిస్తూ మహువామొయిత్రా ప్రవర్త అనైతికం, అమర్యాదకరంగా వర్ణించారు. ఆమె ఎంపీగా కొనసాగడానికి అర్హురాలు కాదని ఆమె ప్రకటించారు.

పార్లమెంట్‌లో మాట్లాడేందుకు తనకు అనుమతి ఇవ్వకుండానే తన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై పార్లమెంట్ వెలుపల మాట్లాడుతూ మహువా మండిపడ్డారు. అన్ని నిబంధనలను కాలరాసి తనపై బహిష్కరణ వేటు వేశారని ఆమె ఆరోపించారు. భవిష్యత్తులో తనపై సిబిఐ దాడులు కొనసాగుతాయని కూడా సభలో హెచ్చరించారని ఆమె చెప్పారు. మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేపట్టింది. కాగా..తమ పార్టీ మహిళా ఎంపీ లోక్‌సభ సభ్యత్వంపై వేటు వేయడాన్ని టిఎంసి అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఖండించారు. ఇది ఆమోదయోగ్యం కాదని ఆమె చెప్పారు. బిజెపి అవలంబిస్తున్న ప్రతీకార రాజకీయాలతో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని ఆమె విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News