Monday, November 25, 2024

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్

- Advertisement -
- Advertisement -

భోపాల్: అనూహ్య రీతిలో మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా 58 సంవత్సరాల మోహన్ యాదవ్ ఎంపికయ్యారు. ఉజ్జయిన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్ యాదవ్ గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రులుగా జగదీష్ దేవడ, రాజేంద్ర శుక్లాను నియమితులయ్యారు. మాజీ కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. డిసెంబర్ 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా గత 8 రోజులగా ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు దీంతో తెరపడింది.

పార్టీలో చాలా చిన్న కార్యకర్తనైన తనను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసినందుకు మోహన్ యాదవ్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసిన మోహన్ యాదవ్ తనకు అప్పగించిన బాథ్యతను సమర్థంగా నిర్వహించడానికి కృషి చేస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ను పుష్పగుచ్ఛంతో అభినందించి ఆశీస్సులు అందచేశారు. సోమవారం బిజెపి శాసనసభా పక్ష సమావేశం జరుగగా ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును పార్టీ కేంద్ర పరిశీలకులలో ఒకరైన మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.

మోహన్ యాదవ్ రాజకీయ ప్రస్థానం:
2013లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది మోహన్ యాదవ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తిరిగి 2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆయన మరోసారి గెలుసొందారు. 2020 జులై 2న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలోని క్యాబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలో ఆయన రాజకీయ ఎదుగుదల మరింత బలపడింది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఉజ్జయిన్ సౌత్ నుంచి పోటీ చేసిన మోహన్ యాదవ్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి చేతన్ ప్రేమ్‌నారాయన్ యాదవ్‌పై 12,941 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ గెలుపుతో ఆయన హ్యాట్రిక్ విజయం సాధించడమే కాకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకున్నారు. 1965 మార్చి 25న ఉజ్జయిన్‌లో జన్మించిన మోహన్ యాదవ్ అనేక దశాబ్దాలుగా బిజెపిలోనే కొనసాగుతున్నారు.రాజకీయ నేతగానే గాక వ్యాపారవేత్తగా కూడా ఆయన రాణిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News