సుప్రీంకోర్టు తీర్పుతో తాము నిరుత్సాహ పడడం లేదని మరో మాజీ ముఖ్యమంత్రి, పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు.‘ సుప్రీంకోర్టు తీర్పుకు మేము నిరుత్సాహ పడడం లేదు.ఈ విషయంలో జమ్మూ కశ్మీర్ ఎన్నో ఒడిదుడుకులను చూసింది. 370 నిబంధన తాత్కాలికమన్న వ్యాఖ్యలతో మేము ఓడిపోయినట్లు కాదు. ఇది భారత దేశ ఆలోచనల ఓటమి.ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ జైలులా మారింది. దుకాణాలు ఉదయం 10 గంటల వరకు తెరవొద్దని ఆదేశించారు. మేమంతా గృహనిర్బంధంలో ఉన్నాం. ఏళ్లనుంచి కొనసాగుతున్న యుద్ధమిది.
మేము ఇక్కడినుంచి వెళ్లం. మేమంతా కలిసి పోరాడుతాం’ అని ఎక్స్‌లో పోస్టు చేసిన ఓ వీడియయోలో మెహబూబా ముఫ్తీ అన్నారు. కాగా సుప్రీంకోర్టు చాలా విచారకరం, దురదృష్టకరమైనదని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన గులాం నబీ ఆజాద్ అన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించాల్సిందేననిఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై జమ్మూ కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలను సంప్రదించి ఉంటే తాము ఎంతో కొంత బేరమాడి ఉండే వాళ్లమని అలా చేయకుండా హడావేడిగా దీన్ని రద్దు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.