Monday, December 23, 2024

రాష్ట్ర హోదా కల్పించి వెంటనే అసెంబ్లీ ఎన్నికలు జరపాలి: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరుకు తక్షణమే రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించాలని, ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు వీలుగా రాష్ట్రంలో వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం డిమాండ్ చేసింది. జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సమర్థిస్తూ తీర్పును వెలువరించింది. అంతేగాక వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ నాయకులు పి చిదంబరం, అభిషేక్ సింఘ్వీ విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తన తీర్పులో అనేక అంశాలను స్పృశించింది కాని కొన్ని అంశాలను విస్మరించిందని అన్నారు.

తీర్పును జాగ్రత్తగా అధ్యయనం చేయవలసి ఉందని అంటూ 370వ అధికరణను రద్దు చేసిన తీరుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తూనే విభేదిస్తున్నామని చిదంబరం చెప్పారు. జమ్మూ కశ్మీరుకు పూర్తిస్థాయి రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని తాము మొదటి నుంచి డిమాండు చేస్తున్నామని, ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. తక్షనమే రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని, లడఖ్ ప్రజల ఆకాంక్షలను కూడా నెరవేర్చాలని ఆయన కోరారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఎన్నికల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని, వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీరుకు రాష్ట్ర ప్రతిపత్తిని తొలగించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు చేసిన అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోకపోవడం నిరాశను కలిగిస్తోందని చిదంబరం చెప్పారు. జమ్మూ కశ్మీరు పౌరులు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారే తప్ప నియంతృత్వాన్నికాదని అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే కేంద్రం ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News