పరస్పర చర్చలు అవసరం : చైనా
బీజింగ్ : కశ్మీర్ సమస్యను భారత్, పాకిస్థాన్‌లు పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. ఇది ద్వైపాక్షిక విషయం , ఈ వరుసలోనే చర్చలు అవసరం అని మంగళవారం చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. కశ్మీర్ సంబంధిత ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు గురించి చైనా ప్రతినిధి విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు. పాకిస్థానీ జర్నలిస్టు ఈ సందర్భంగా భారతదేశ సుప్రీంకోర్టు తీర్పుపై చైనా స్పందనను కోరారు. దీనికి చైనా తరఫున నింగ్ సమాధానం ఇచ్చారు. కశ్మీర్ విషయంలో చైనా వైఖరి సుస్పష్టంగా ఉందని ఈ ప్రతినిధి తెలిపారు.
ఇరుదేశాలే సమస్యను పరిష్కరించుకోవల్సి ఉంటుందని ఈ మహిళా ప్రతినిధి వెల్లడించారు. శాంతియుత పద్దతులు, ఐరాస ఛార్టర్, భద్రతా మండలి తీర్మానాలు కశ్మీర్ విషయంలో ఖరారు అయి ఉన్నాయని, వీటి పరిధిలోనే భారత్ పాకిస్థాన్ సరైన రీతిలో పరిష్కారాలు వెతుక్కోవల్సి ఉంటుందన్నారు. ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు పట్ల పాకిస్థాన్ స్పందించింది. ఆర్టికల్ 370 రద్దు సబబే అనే తీర్పు చట్టరీత్యా చెల్లనేరదని స్పందించింది. అంతర్జాతీయ న్యాయం పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం నిలవజాలదని చైనా మిత్రదేశం అయిన పాకిస్థాన్ ప్రకటించింది. కాగా ఇది పూర్తిగా ఇరుదేశాల వ్యవహారం అని , సంప్రదింపులు ముఖ్యమని చైనా పేర్కొంది.