పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి
ఉపాధి, ఆర్ధికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలి
అధికారులకు సిఎం రేవంత్ ఆదేశాలు
ఎంఐఎం ఎంఎల్‌ఎలతో భేటి
పాతబస్తీ అభివృద్ధితో పాటు మూసీ అభివృద్ధిపై చర్చ
మనతెలంగాణ/హైదరాబాద్ : మహానగరంలో మూసీనది ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి వరకు పరీవాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలతో మంగళవారం సమావేశం అయ్యారు.
ఈ భేటీలో ఆయన పాతబస్తీ అభివృద్ధి అక్కడ చేపట్టే సంక్షేమం వంటి కార్యక్రమాలతో పాటు మూసీ అభివృద్ధి పనులపై చర్చించారు. తెలంగాణ సచివాలయంలో జరిగిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పై జరిగిన సమావేశంలో సిఎం రేవంత్ మాట్లాడుతూ మొత్తం మూసీ పరీవాహక ప్రాంతాన్ని పర్యాటకులను ఆకర్శించే విధంగా స్వీయ ఆర్థిక చోదక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సిఎం అధికారులకు సూచించారు. దీనికిగాను, మూసీ నదీ వెంట బ్రిడ్జి లు, కమర్షియల్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, అమ్యూజ్ మెం ట్ పార్కులు, హాకర్ జోన్‌లు, పాత్-వేలను ప్రభుత్వ, ప్రైవే టు పార్ట్‌నర్ షిప్ విధానంలో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
మూసీనదిలో కాలుష్యాన్ని తగ్గించి, మురుగు నీరు ప్రవహించకుండా అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. మూసీలో శుద్ధి చేసిన నీరు ప్రవహించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు తగిన నీటి మట్టం ఉండేలా చెక్ డ్యాంలు నిర్మించాలని సిఎం ఆదేశించారు. సిఎంగా బాధ్యతలను చేపట్టిన తర్వాత సిఎం రేవంత్ తొలిసారి గ్రేటర్ ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావే శంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఒవైసీతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మె ల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, జలమండలి ఎండి దానకిషోర్, సిఎంఓ అధికారులు శేషాద్రి, శివధర్ రెడ్డి, షానవాజ్ ఖాసీం, జీహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్‌లు పాల్గొన్నారు.