Tuesday, January 21, 2025

టిఎస్ పి ఎస్ సి ప్రక్షాళన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు స మర్థవంతంగా నిర్వహిస్తున్న యుపిఎస్‌సితోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి మంగళవారం సచివాలయంలో సిఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సి.ఎం కార్యదర్శి శేషాద్రి, డిజిపి రవి గుప్తా, అడిషనల్ డిజి సివి ఆనంద్, టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి అనితారామచంద్రన్, ఆర్థిక శాఖ కార్యదర్శి టి.కె.శ్రీదేవి, సిట్ స్పెషల్ అధికారి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, న్యూఢిల్లీలోని యుపిఎస్‌సితో సహా పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అక్కడి నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని తెలిపారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్, సభ్యుల నియామకాలకు సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా ఉండే విధంగా తగిన మార్గదర్శకాలు రూపొందించాలని సిఎం ఆదేశించారు. తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కావాల్సిన సిబ్బందిని, ఇతర సదుపాయాలను వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు.

పకడ్బందీగా టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ : సిఎం
త్వరలో జరుగనున్న పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బంధీగా, ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఉండే విధంగా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంగళవారం విద్యాశాఖపై సిఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సిఎంఓ కార్యదర్శి శేషాద్రి, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, ఇతర అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న విశ్వవిద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదిక అందచేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదికతోపాటు, రాష్ట్రంలో ఎక్కడ జూనియర్ కళాశాలలు అవసరం ఉన్నాయో, వాటి వివరాలు వెంటనే సమర్పించాలని కోరారు. ప్రధానంగా బాలికల కోసం జూనియర్ కళాశాలలు ఎక్కడ అవసరమో పరిశీలించి వాటికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News