పోలీసు అధికారులకు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసి,
శానససభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు ఆదేశాలు
లోక్‌సభలో జరిగిన ఘనట నేపథ్యంలో
భద్రత చర్యలపై అత్యవసర సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : శాసనసభ సమావేశాలు సజావుగా సాగడానికి మూడెంచెల భద్రత చర్యలను పటిష్టంగా అమలు చేయాలని పోలీసు అధికారులకు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసి, శానససభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. లోక్‌సభలోకి ఆగంతకులు చొచ్చుకుని వెళ్లిన సంఘటన నేపథ్యంలో బుధవారం రాత్రి స్పీకర్ కార్యాలయంలో శాసనమండలి చైర్మన్, శాసనసభ ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ అత్యవసర సమావేశంలో ఆగంతుకుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో లోక్‌సభలో జరిగిన సంఘనట తరహా సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ప్రొటెం స్పీకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జారీ చేసిన పాసులు తప్ప ఇతరత్రా అన్ని రకాల పాసుల జారీని నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, డి.జి.పి రవి గుప్త, హైదరాబాదు పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.